Telugu Global
NEWS

కాపులకు రాజ్యాధికారం డిమాండు వదిలేసినట్లేనా?

రెండు రాష్ట్రాల్లో ఒక్కో అజెండాతో, ఒక్కో పార్టీతో పవన్ పొత్తు పెట్టుకున్నారు. ఇలాంటి అజెండాలను, పొత్తులను జనాలు ఆమోదించే అవకాశాలు చాలా తక్కువ.

కాపులకు రాజ్యాధికారం డిమాండు వదిలేసినట్లేనా?
X

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొత్తగా అందుకున్న బీసీ అజెండా రివర్సు కొట్టేట్లుంది. రెండు రాష్ట్రాల్లో రెండు అజెండాలను పవన్ అమలుచేయబోతున్నారా అనే చర్చ పెరిగిపోతోంది. తెలంగాణలో బీజేపీ గెలిస్తే బీసీ ముఖ్యమంత్రి అవుతారని నరేంద్ర మోడీ ప్రకటించారు. దానికి పవన్ మద్దతుగా మాట్లాడారు. బీసీలకు రాజ్యాధికారం అప్పగించాలన్న బీజేపీ అజెండాకు తాను మద్దతుగా నిలుస్తున్నట్లు బహిరంగసభలో పవన్ ప్రకటించారు. బీసీలకు రాజ్యాధికారం అన్న అజెండాను బీజేపీ అమలుచేస్తోంది కాబట్టే తాను మద్దతుగా నిలిచినట్లు చెప్పారు.

ఇంతవరకు బాగానే ఉంది మరి ఏపీలో పరిస్థితి ఏమిటి? బీసీలకు రాజ్యాధికారం అన్న అజెండాకే పవన్ కట్టుబడి ఉండేట్లయితే ఏపీలో కూడా అదే అజెండాకు కట్టుబడి ఉండాలి కదా. కానీ ఏపీలో మాత్రం కమ్మోరికే రాజ్యాధికారం అన్న అజెండాకు పవన్ ఎలా మద్దతుగా నిలబడ్డారు. టీడీపీ+జనసేన పొత్తు సక్సెస్ అయితే ముఖ్యమంత్రి అయ్యేది చంద్రబాబునాయుడే కదా. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేట్లయితే ఇక బీసీలకు రాజ్యాధికారం అన్న అజెండాను తుంగలో తొక్కినట్లే కదా.

అంటే రెండు రాష్ట్రాల్లో పవన్‌ది రెండు అజెండాలన్న విషయం అర్థ‌మైపోతోంది. రెండు అజెండాల మధ్య మరో కీలకమైన అజెండాను పవన్ మరచిపోయారు. అదేమిటంటే కాపులకు రాజ్యాధికారం అన్న డిమాండును పవన్ వదిలేసినట్లే ఉన్నారు. ఒకపుడు రాజ్యాధికారం అంటు కాపులను పదేపదే పవన్ రెచ్చగొట్టిన విషయం గుర్తుండే ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో బీసీలదే అత్యధిక జనాభా అని అందరికీ తెలుసు. జనాభాలో బీసీలు ఎక్కువగా ఉన్నారు కాబట్టే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే సీఎం అభ్యర్థిగా బీసీ నేతే ఉంటారని చెప్పింది.

మరి ఏపీలో కూడా బీసీల జనాభా ఎక్కువగానే ఉంది కదా. ఏపీలో కూడా బీజేపీ బీసీలకే రాజ్యాధికారం అన్న నినాదాన్ని ఎత్తుకుంటే అప్పుడు పవన్ ఏమిచేస్తారు? ఇప్పటికే టీడీపీతో పొత్తు పెట్టుకోవటం ద్వారా మిత్రపక్షం బీజేపీకి దూరంగా జరిగినట్లే అనుకోవాలి. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే రెండు రాష్ట్రాల్లో ఒక్కో అజెండాతో, ఒక్కో పార్టీతో పవన్ పొత్తు పెట్టుకున్నారు. ఇలాంటి అజెండాలను, పొత్తులను జనాలు ఆమోదించే అవకాశాలు చాలా తక్కువ. మరి తెలంగాణలోని బీసీ అజెండా ఏపీలో రివర్సు కొడుతుందేమో చూడాలి.

First Published:  9 Nov 2023 10:33 AM IST
Next Story