Home Loans | ఈ చిట్కా పాటిస్తే సగం రుణ భారం ఔట్.. ఎలాగంటే..?!
మూడేండ్ల క్రితం అంటే 2020లో 20 ఏండ్ల గడువుతో 7 శాతం వడ్డీపై రూ.50 లక్షల ఇంటి రుణం తీసుకుంటే.. మీ నెలవారీ ఈఎంఐ రూ. 38,675 అవుతుంది.
Home Loans | గతేడాది భారీగా పెరిగిపోయిన ద్రవ్యోల్బణానికి అడ్డుకట్ట వేసేందుకు ఆర్బీఐ పెంచిన రెపో రేట్‌కు అనుగుణంగా వాణిజ్య బ్యాంకులు రుణాలపై.. ప్రత్యేకించి ఇళ్ల రుణాలపై వడ్డీ రేట్లు పెంచేశాయి. ఇది ఇప్పటికే ఇళ్ల రుణాలు తీసుకుని వాయిదాలు చెల్లిస్తున్న వారి పరిస్థితి ఇబ్బందికరంగా మారింది.
సాధారణంగా వడ్డీ రేట్లు పెరిగినప్పుడు బ్యాంకర్లు వెంటనే తమ రుణ గ్రహీతలపై భారం మోపకుండా జాగ్రత్త పడుతుంటాయి. అందుకే పెరిగిన వడ్డీరేటుకనుగుణంగా ఈఏంఐ యధాతథంగా కొనసాగిస్తూ, లోన్ టెన్యూర్ పెంచేస్తాయి. దీని వల్ల రుణ గ్రహీతపై తక్షణ ఆర్థిక భారం పడదు. కానీ కొందరు రుణ గ్రహీతలు రిటైర్మెంట్ పూర్తయ్యే వరకూ రుణం చెల్లించాల్సి వస్తోంది.
రుణ గ్రహీతల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకున్న ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకున్నది. వడ్డీరేట్లు పెరిగినప్పుడు నెల వారీ ఈఎంఐ చెల్లింపు మొత్తం పెంచుకోవడమా.., లోన్ టెన్యూర్ పెంచుకోవడమా.. అన్న నిర్ణయం రుణ గ్రహీతల ఇష్టానికే వదిలేయాలని బ్యాంకర్లకు సూచించింది. అలాగే ఫ్లోటింగ్ ఇంటరెస్ట్ లేదా ఫిక్స్ డ్ వడ్డీ రేటు విధానంలోకి మారాలా అనే ఆప్షన్ కూడా రుణ గ్రహీతలకు వదిలేయాలని బ్యాంకర్లకు ఆర్బీఐ సూచించింది. ఈ మేరకు ఆగస్ట్ 18న నోటిఫికేషన్ జారీ చేసింది.
మూడేండ్ల క్రితం అంటే 2020లో 20 ఏండ్ల గడువుతో 7 శాతం వడ్డీపై రూ.50 లక్షల ఇంటి రుణం తీసుకుంటే.. మీ నెలవారీ ఈఎంఐ రూ. 38,675 అవుతుంది. ఈ లెక్కన రుణం పూర్తిగా పే చేసే నాటికి మొత్తం రూ. 43.04 లక్షల వడ్డీ చెల్లిస్తారన్న మాట. అసలుతో కలిపి మొత్తం రూ.93.04 లక్షలు చెల్లిస్తారు.. ఇంకా ప్రాసెసింగ్ చార్జీలు అదనం.
2022 మే నుంచి వడ్డీరేట్లు పెరుగుతూ వచ్చాయి. మూడేండ్ల తర్వాత ఆర్బీఐ తాజా సర్క్యులర్, పెరిగిన వడ్డీ రేట్ల ప్రకారం లెక్క వేసి చెక్ చేసుకుంటే అదనంగా రూ.33 లక్షల వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. అదెలాగో చూద్దాం.
ఇప్పుడు రుణం పేమెంట్ గడువు మరో 17 ఏళ్లు మాత్రమే.. పెరిగిన వడ్డీ రేటు ప్రకారం మీ ఋణంపై వడ్డీ 9.25 శాతం అవుతుంది. తాజా ఆర్బీఐ నిర్ణయానికి అనుగుణంగా ఈఎంఐ పెంచుకోవచ్చు.. లేదా రుణం చెల్లింపు గడువు పెంచుకోవచ్చు. అది రుణ గ్రహీత ఆప్షన్ కే వదిలేస్తుంది. ఫ్లోటింగ్, లేదా ఫిక్స్డ్ వడ్డీరేటులో మీ ఆర్థిక పరిస్థితులను బట్టి ఎదుర్కోవచ్చు.
ఈఎంఐ పెంచుకుంటే, ఇప్పుడు మీ నెలవారీ వాయిదా ఈఏంఐ రూ. 44,978 పే చేయాల్సి ఉంటుంది. అలా రుణం పూర్తిగా చెల్లించే నాటికి అదనంగా రూ.55.7 లక్షల వడ్డీ పే చేయాల్సి వస్తుంది.
అలా కాక, మీరు మీ ఈఎంఐ యధాతథంగా రూ. 38,675 పే చేయాలనుకుంటే రుణం గడువు 321 నెలలకు పొడిగిస్తారు బ్యాంకు అధికారులు. అలా పొడిగిస్తే మొత్తం లోన్ టెన్యూర్ పూర్తయ్యే సరికి రూ. 88.52 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.. అంటే అదనంగా రూ. 33 లక్షలు చెల్లించాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.