Credit Cards Benifits | సెలెక్టెడ్ క్రెడిట్ కార్డుల రూల్స్ సవరణ.. స్పెండింగ్ కొద్దీ రివార్డు పాయింట్లు, క్యాష్‌బ్యాక్, కాంప్లిమెంటరీ పాస్‌లు..!
దేశంలోని ప్రధాన బ్యాంకులు తమ క్రెడిట్ కార్డులపై ఇచ్చే రాయితీలు, నియమ నిబంధనలను సవరించాయి. ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంకులు కొన్ని సెలెక్టెడ్ క్రెడిట్ కార్డుల వాడకం, నిబంధనల్లో మార్పులు తెచ్చాయి.
Credit Cards Benefits | గతంలో వేతన జీవులు, వ్యాపారులు మినహా సామాన్యులెవ్వరికీ క్రెడిట్ కార్డులు అందుబాటులో ఉండేవి కావు. కానీ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తమ మార్కెట్ల విస్తరణ కోసం సిబిల్ స్కోర్ మెరుగ్గా ఉంటే చాలు క్రెడిట్ కార్డులు జారీ చేస్తున్నాయి. ఆన్‌లైన్ కొనుగోళ్లలో రాయితీలు, డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ ఆఫర్లు లభిస్తుండడంతో క్రెడిట్ కార్డుల వాడకం కూడా క్రమంగా పుంజుకున్నది. ఈ తరుణంలో దేశంలోని ప్రధాన బ్యాంకులు తమ క్రెడిట్ కార్డులపై ఇచ్చే రాయితీలు, నియమ నిబంధనలను సవరించాయి. ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంకులు కొన్ని సెలెక్టెడ్ క్రెడిట్ కార్డుల వాడకం, నిబంధనల్లో మార్పులు తెచ్చాయి.. అవేమిటో చూద్దామా..!
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై మార్పులు ఇలా
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన రెండు పాపులర్ క్రెడిట్ కార్డులు రెగాలియా, మిలీనియా కార్డుల వాడకంపై కీలక మార్పులు చేసింది. రెగాలియా క్రెడిట్ కార్డుతో విమానాశ్రయాల లాంజ్ యాక్సెస్ మీద మార్పులు చేసింది.
1. మీ క్రెడిట్ కార్డు వాడకం ఆధారంగా విమానాశ్రయాల్లో లాంజ్ యాక్సెస్ ప్రోగ్రామ్ ఆధారపడి ఉంటుంది.
2. ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రతి త్రైమాసికంలోనూ రూ.లక్ష, అంతకంటే ఎక్కువ ఖర్చు చేయాలి.
3. రెగాలియా క్రెడిట్ కార్డ్ స్పెండింగ్ పాలసీ కోసం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వెబ్ సైట్‌లోకి వెళ్లి రెగాలియా స్మార్ట్ బై పేజీని సందర్శించి లాంజ్ బెనిఫిట్లు, లాంజ్ యాక్సెస్ ఓచర్ గురించి తెలుసుకోవచ్చు. (2023 డిసెంబర్ ఒకటో తేదీ నుంచే ఈ నిబంధన అమల్లోకి వచ్చింది.
4. ప్రతి త్రైమాసికంలో స్పెండింగ్ లక్ష్యాలను దాటితే విమానాశ్రయాల్లో రెండు కాంప్లిమెంటరీ లాంజ్ యాక్సెస్ ఓచర్‌లు పొందొచ్చు.
ఇలా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మిలీనియా క్రెడిట్ కార్డు ఆఫర్లు
1. మీ క్రెడిట్ కార్డు వాడకం ఆధారంగా విమానాశ్రయాల్లో లాంజ్ యాక్సెస్ ప్రోగ్రామ్ ఆధారపడి ఉంటుంది.
2. ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రతి త్రైమాసికంలోనూ రూ.లక్ష, అంతకంటే ఎక్కువ ఖర్చు చేయాలి.
3. మీ స్పెండింగ్‌ను బట్టి మీకు మిలీనియా మైల్ స్టోన్ పేజీలో సెలెక్ట్ లాంజ్ యాక్సెస్ ఓచర్ లింక్ మెసేజ్ వస్తుంది.
4. మీ క్రెడిట్ కార్డు స్పెండింగ్‌ను బట్టి ప్రతి త్రైమాసికంలో విమానాశ్రయంలో ఒక కాంప్లిమెంటరీ లాంజ్ యాక్సెస్ ఓచర్ లభిస్తుంది.
ఎస్బీఐ కార్డుపై మార్పులు ఇలా
ఎస్బీఐ కార్డ్ వెబ్‌సైట్ ప్రకారం.. `మీ పేటీఎం ఎస్బీఐ క్రెడిట్ కార్డు`తో రెంట్ చెల్లింపు లావాదేవీలపై క్యాష్‌బ్యాక్ ఆఫర్ ఉపసంహరించింది. ఇది 2024 జనవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. ఎస్బీఐ సింప్లీ క్లిక్, ఎస్బీఐ సింప్లీ క్లిక్ అడ్వాంటేజ్ కార్డులతో ఆన్‌లైన్ ఈజీ డైనర్ కొనుగోళ్లు జరిపితే 10ఎక్స్ రివార్డు పాయింట్ల నుంచి ఐదు ఎక్స్ రివార్డు పాయింట్లకు కుదించింది. అపోలో 24x7, బుక్ మై షో, క్లియర్ ట్రిప్, డొమినోస్, మింత్రా, నెట్‌మెడ్స్, యాత్ర వెబ్ సైట్లలో ఆన్ లైన్ కొనుగోళ్లు జరిపితే 10ఎక్స్ రివార్డు పాయింట్లు పొందొచ్చు.
ఇలా యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డు రూల్స్ మార్పు
ఇటీవలే యాక్సిస్ బ్యాంక్ తన క్రెడిట్ కార్డు యూజర్లకు కొన్ని ముఖ్యమైన సవరణలు తెచ్చింది. యాక్సిస్ బ్యాంక్‌మాగ్నస్ క్రెడిట్ కార్డుపై వార్షిక ఫీజు, జాయినింగ్ గిఫ్ట్ నిబంధనలు సవరించింది. యాక్సిస్ బ్యాంక్ రిజర్వ్ క్రెడిట్ కార్డు నిబంధనలు సవరించింది.
21 ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డులపై మారిన రూల్స్
ఐసీఐసీఐ బ్యాంక్ జారీ చేసిన 21 క్రెడిట్ కార్డుల వాడకంపై ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్ బెనిఫిట్లు, రివార్డు పాయింట్ల నిబంధనల్లో గణనీయ మార్పులు చేసింది. గత త్రైమాసికంలో క్రెడిట్ కార్డ్ స్పెండింగ్ ఆధారంగా వచ్చే ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి వచ్చే త్రైమాసికంలో ఒక కాంప్లిమెంటరీ ఎయిర్ పోర్ట్ లాంజ్ యాక్సెస్ పొందొచ్చు. గత త్రైమాసికంలో రూ.35 వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. జనవరి-మార్చి త్రైమాసికంలో రూ.35 వేలు ఖర్చు చేస్తే ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఎయిర్ పోర్టులో ఒక కాంప్లిమెంటరీ లాంజ్ యాక్సెస్ ఓచర్ లభిస్తుంది.