Telugu Global
National

ఇది వినాశనానికే గానీ.. విజయానికి కాదు

వారానికి 90 గంటల పాటు పనిచేయాలని, ఆదివారం సెలవునూ వదులుకోవాలని ఎల్‌అండ్‌ టీ ఛైర్మన్‌ వ్యాఖ్యలకు హర్ష్‌ గోయెంకా కౌంటర్‌

ఇది వినాశనానికే గానీ.. విజయానికి కాదు
X

వారానికి 90 గంటల పాటు పనిచేయాలని, ఆదివారం సెలవునూ వదులుకోవాలని ఎల్‌అండ్‌ టీ ఛైర్మన్‌ ఎస్‌.ఎన్‌. సుబ్రహ్మణ్యన్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ అంశంపై ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆర్‌పీజీ గ్రూప్‌ ఛైర్మన్‌ హర్ష్‌ గోయెంకా స్పందించారు. 'ఇది వినాశనానికే గానీ.. విజయానికి కాదు' అంటూ తన అభిప్రాయాన్ని 'ఎక్స్‌' వేదికగా వెల్లడించారు.

'వారానికి 90 రోజుల పనా? సండేను సన్‌-డ్యూటీ అని..'డే ఆఫ్‌'ను ఓ 'ఊహాజనిత భావన' అని ఎందుకు మార్చకూడదు. కష్టపడి తెలివిగా పనిచేయడంపై నాకు నమ్మకం ఉన్నది. కానీ జీవితాన్ని శాశ్వతమైన ఆఫీసు షిప్టుగా మారిస్తే అది వినాశనానికి దారితీస్తుందే తప్ప విజయాన్ని తీసుకురాదు. వర్క్‌ బ్యాలెన్స్‌ అనేది ఆప్షన్‌ కాదు. అవసరం అని నా అభిప్రాయం' అని హర్ష్‌ గొయెంకా ఎక్స్‌ వేదికగా పోస్టు చేశారు. 'వర్క్‌ స్మార్ట్‌ నాట్‌ స్లేవ్‌' అంటూ హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశారు. ప్రస్తుతం గొయెంక పోస్ట్‌ నెట్టిట వైరల్‌గా మారింది.

మరోవైపు సెలబ్రిటీలు దీనిపై స్పందిస్తున్నారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా బాలీవుడ్‌ అగ్ర హీరోయిన్‌ దీపికా పదుకొణె అసహనం వ్యక్తం చేస్తూ పోస్టు పెట్టారు. ఉన్నత హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఆశ్చర్యానికి గురయ్యానని ఆమె పేర్కొన్నారు.

ఈ విషయంపై భారత మాజీ బ్మాడ్మింటన్‌ స్టార్‌ గుత్తా జ్వాలా సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు. విద్యావంతులు, ప్రముఖ కంపెనీలో ఉన్నతస్థాయిలో ఉన్న వ్యక్తులే ఇలా మాట్లాడటం సరికాదని పేర్కొన్నారు. మానసిక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత వంటి విషయాలను పట్టించుకోకపోవడమే కాకుండా స్త్రీల పట్ల విద్వేషపూరిత ప్రకటనలు చేయడం చాలా విచారకరమని అభిప్రాయపడ్డారు.

ఎల్‌అండ్‌ టీ ఛైర్మన్‌ సుబ్రహ్మణ్యన్‌ చేసిన వ్యాఖ్యలపై కంపెనీ స్పష్టత ఇచ్చింది. ఎనిమిది దశాబ్దాలుగా జాతి నిర్మాణమే ఎల్‌ అండ్‌ టీకి ప్రధాన లక్ష్యంగా ఉన్నది. భారత మౌలిక వసతులు, పరిశ్రమలు, సాంకేతిక సామర్థ్యాలను ఎల్‌ అండ్‌ టీ మెరుగుపరిచింది. అభివృద్ధి చెందిన దేశంగా ఎదిగే క్రమంలో అసాధారణ లక్ష్యాలను చేరుకోవాలంటే అసాధరణ కృషి అవసరం. ఈ విస్తృత లక్ష్యాన్నే చైర్మన్‌ వ్యాఖ్యలు ప్రతిబింబిస్తాయని కంపెనీ ప్రతినిధి ఒకరు వివరణ ఇచ్చారు.

First Published:  10 Jan 2025 2:16 PM IST
Next Story