Telugu Global
National

'మహా' ఎన్నికలు: ఫ్రెండ్లీ పోటీలో మునిగేదెవరో? తేలేదెవరో?

ఆసక్తికరంగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు...ఫ్రెండ్లీ కంటెస్ట్‌ ఎదుర్కొంటున్న మహాయుతి, మహా వికాస్‌ అఘాడీలు

మహా ఎన్నికలు: ఫ్రెండ్లీ పోటీలో మునిగేదెవరో? తేలేదెవరో?
X

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఈసారి ఆసక్తికరంగా మారాయి. పోటీలో ఉన్న రెండు ప్రధాన కూటములు మహాయుతి, మహా వికాస్‌ అఘాడీలు భాగస్వామ్య పక్షాలతో సీట్ల సర్దుబాటు చేసుకున్నా కొన్నిచోట్ల స్నేహపూర్వక పోటీ తప్పేలా లేదు. మొత్తం 288 స్థానాలకు జరుగుతున్న పోరులో 29 చోట్ల ఫ్రెండ్లీ కంటెస్ట్‌ ఉండటం విశేషం. రెండు కూటముల్లోనూ ఇదే పరిస్థితి ఉన్నది. అయితే ఈ విషయంలో మహా వికాస్‌ అఘాడీ (ఎంవీఏ)లో చాలా ఎక్కువగా ఉన్నది. హర్యానాలోనూ ఇదే పరిస్థితి నెలకొన్నది. ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలే సీట్లు సర్దుబాటు చేసుకోవడంలో విఫలమై సొంతంగా పోటీ చేయడం వల్ల ఎగ్జిట్‌ పోల్స్‌కు భిన్నంగా అక్కడ ఫలితాలు వచ్చాయి. ఇప్పుడు 29 చోట్ల ఫ్రెండ్లీ కంటెస్ట్ ఏ కూటమిని దెబ్బతీస్తుందోననే చర్చ జరుగుతున్నది.

బీజేపీ ఏక్‌నాథ్‌ శిండే నేతృత్వంలోని శివసేన, అజిత్‌ పవార్‌ నేతృత్వంలోని మహాయుతి కలిసి పోటీ చేస్తున్నది. ఈ మూడు పార్టీల మధ్య మొత్తం ఆరు నియోజకవర్గాల్లో ఫ్రెండ్లీ కంటెస్ట్‌ ఉన్నది. ఉద్ధవ్‌ నేతృత్వంలోని శివసేన, ఎన్సీపీ (శరద్‌పవార్‌) కాంగ్రెస్‌ కూటమి (మహా వికాస్‌ అఘాడీ) 21 చోట్ల ఇతర చిన్న పార్టీలతో పోటీ ఎదుర్కొనున్నాయి. ముఖ్యంగా నాందేడ్‌ నార్త్‌ స్థానానికి కాంగ్రెస్‌ అభ్యర్థి అబ్దుల్‌ గపూర్‌ పోటీ ఉండగా.. అదే స్థానంలో శివసేన (యూబీటీ) సంగీతా పాటిల్‌ పోటీ చేస్తున్నారు. మిగిలిన స్థానాల్లో ఎంవీఏ కూటమి కూటమి అభ్యర్థులు పోటీ చేస్తున్న స్థానాల్లో పీజెంట్స్‌ అండ్‌ వర్కర్స్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (పీడబ్య్లూపీఐ ), (సమాజ్‌వాదీ పార్టీ) ఎస్పీ, లెఫ్ట్‌ పార్టీలు తమ అభ్యర్థులను నిలిపాయి. ఎస్పీ 8 చోట్ల పోట చేస్తుండగా.. కాంగ్రెస్‌ పోటీ చేస్తున్న 6 చోట్ల తన అభ్యర్థులను నిలిపింది. పీడబ్య్లూపీఐ 14 మందిని పోటీకి నిలుపగా.. మెజారిటీ అభ్యర్థులను శివసేన (యూబీటీ) పోటీకి పెట్టింది. తాము ఆరు చోట్ల పోటీ చేయడానికి సీట్లు కేటాయించాలని కోరగా దానికి పెద్ద పార్టీలు అంగీకరించలేదని పీడబ్య్లూపీఐ నేత ఒకరు తెలిపారు. కూటమి పార్టీ ఓట్లను చీల్చే అవకాశం ఉన్నదా? అని ప్రశ్నించగా... తమ అభ్యర్థనను పట్టించుకోలేదని, కాబట్టి తామేమీ చేయలేమన్నారు. ఎంవీఏలో ఈ 21 చోట్ల ఎవరు ఎవరిని ఓడిస్తారు? అది అంతిమంగా ఎవరికి లబ్ధి చేకూరుస్తుందని అన్నది నవంబర్‌ 23న తేలుతుంది. కాంగ్రెస్‌ స్వయంకృతం తోనే హర్యానాలో అధికారానికి రాలేకపోయిందనే వాదనలు వినిపిస్తుండగా.. మహారాష్ట్రంలోనూ ఎంవీఏ వైఖరి ఇండియా కూటమి లో మరిన్ని సమస్యలు తెచ్చిపెట్టేలా ఉన్నదనే విమర్శలు వ్యక్తమౌతున్నాయి. ముఖ్యంగా ఈ ఎన్నికల తర్వాత భవిష్యత్తులో యూపీలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ సింగిల్‌ గా పోటీ చేస్తుందా లేదా కాంగ్రెస్‌ను కలుపుకుని వెళ్తుందా అన్నది ఆధారపడి ఉంటుంది.

First Published:  9 Nov 2024 2:05 PM GMT
Next Story