మోదీ ఏ నిర్ణయం తీసుకున్నా శిరసావహిస్తా
సీఎం పదవిపై మోడీ, అమిత్ నిర్ణయమే అంతిమం అన్న ఏక్‌నాథ్ శిండే
మహారాష్ట్ర తదుపరి సీఎం ఎవరు అన్న చర్చ జరగుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ శిండే కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ... మోదీ, అమిత్ షా తనతో ఫోన్‌లో మాట్లాడారని చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటు గురించి నా అభిప్రాయం తెలుసుకున్నారు. మీరు (మోడీ, అమిత్ షా) ఏ నిర్ణయం తీసుకున్నా నాకు ఆమోదమేనని చెప్పాను. ఎన్‌డీఏ అధినేతగా మోదీ ఏ నిర్ణయం తీసుకున్నా శిరసావహిస్తానని స్పష్టం చేశారు. సీఎం పదవిపై మోడీ, అమిత్ నిర్ణయమే అంతిమం అన్నారు. ప్రభుత్వ ఏర్పాటులో అడ్డంకిగా ఉండబోనని మోదీకి చెప్పినట్లు శిండే తెలిపారు. బీజేపీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానన్నారు.
మహాయుతికి చరిత్రాత్మక విజయాన్ని కట్టబెట్టిన మహారాష్ట్ర ఓటర్లకు మరోసారి ధన్యవాదాలు. ఎన్నికల సమయంలో తెల్లవార్లు పనిచేశాను. రోజుకు రెండు మూడు గంటలు మాత్రమే నిద్రపోయాను. ఒక కార్యకర్తలా చెప్పులరిగేలా తిరిగాను. నా దృష్టిలో సీఎం అంటే కామన్ మ్యాన్ అని.. నన్ను నేను ఎప్పుడూ సామాన్యుడిగానే భావిస్తాను అన్నారు. సీఎంగా కాకుండా సామాన్యుడిలా పనిచేశానని తెలిపారు. మా సంక్షేమ పథకాలు చూసిన తర్వాతే మళ్లీ పట్టం కట్టారు. బీజేపీ, మోడీ నాకు ఎప్పుడూ అండగానే ఉన్నారు. ముఖ్యమంత్రిగా రెండున్నరేళ్లుగా చేసిన పని సంతృప్తినిచ్చింది. నిత్యం బాల్‌ఠాక్రే మార్గంలోనే పయనించానని చెప్పారు. మహారాష్ట్ర ప్రజలు నన్ను కుటుంబసభ్యుడిలా భావించారు. నేను ఎప్పుడూ ప్రజల కోసమే పనిచేశానని. పదవుల కోసం కాదన్నారు.
అయితే మహారాష్ట్ర తదుపరి సీఎం ఎవరు అనేదానిపై సస్పెన్స్ కొనసాగుతున్నది. దేవేంద్ర ఫడ్నవీస్ అవుతారా? షిండే కొనసాగుతారా? అని బీజేపీ, శివసేన వర్గాల్లో చర్చ కొనసాగుతున్నది. అయితే బీజేపీ మెజారిటీ స్థానాలు దక్కించుకోవడానికి దేవేంద్ర ఫడ్నవీస్ కారణమని ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆయనకే మద్దతుగా నిలుస్తున్నది. అయితే శిండేనే సీఎంగా కొనసాగించాలని ఆయన వర్గం కోరుతున్నది.