ఈవీఎంలలో డేటా డిలీట్ చేసే ప్రక్రియ ఏంటి?
ఎలక్షన్ కమిషన్ ను ప్రశ్నించిన సుప్రీం కోర్టు.. 15 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశం
![ఈవీఎంలలో డేటా డిలీట్ చేసే ప్రక్రియ ఏంటి? ఈవీఎంలలో డేటా డిలీట్ చేసే ప్రక్రియ ఏంటి?](https://www.teluguglobal.com/h-upload/2025/02/11/1402463-evms-supreme-court.webp)
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన భారత్‌లో ఎన్నికల నిర్వహణకు ఉపయోగిస్తున్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల భద్రతపై రాజకీయ పార్టీలకే కాదు సామాన్యులకు ఎన్నో సందేహాలు ఉన్నాయి. వాటికి ఎప్పటికప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సమాధానాలు చెప్తూ వస్తోంది. అయినా ప్రజల్లో నెలకొన్న అనుమానాలు మాత్రం వీడటం లేదు. ఎన్నికల్లో ఓటింగ్‌కు వినియోగించిన ఈవీఎంల విషయంలో ఎలాంటి ప్రమాణాలు పాటిస్తున్నారో చెప్పాలని ఎలక్షన్ కమిషన్‌ను సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈవీఎంలలో డేటాను తొలగించవద్దని కోరుతూ అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు మంగళవారం విచారించింది. ఓటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఈవీఎంలలో నిక్షిప్తమైన డేటాను తొలగించవద్దని, కొత్తగా జోడించవద్దని సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం తేల్చిచెప్పింది. ఈవీఎంలలో డేటాను తొలగించడానికి ఎలాంటి ప్రక్రియ అనుసరిస్తున్నారు.. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు ఏమున్నాయో తమకు 15 రోజుల్లోగా నివేదించాలని ఆదేశించింది. ఈవీఎంలలో సింబల్ లోడింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత కనీసం 45 రోజుల పాటు డేటాను భద్రపరచాలని సూచించింది. ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తర్వాత అభ్యర్థులకు ఏమైన అభ్యంతరాలుంటే వాటిని లేవనెత్తాలని సూచించింది. ఇంజనీర్ల టీమ్ మైక్రో కంట్రోలర్ ఈవీఎంలలో బర్న్ చేసి చేసిన మొమోరీని క్రాస్ చెక్ చేసి వాస్తవాలు వెల్లడించాలని ఆదేశించింది.