ప్రియాంక విజయంపై రాబర్ట్ వాద్రా ఏమన్నారంటే!
ప్రియాంక పార్లమెంటులో ప్రజల గళాన్ని వినిపించనున్నారు. నాకూ అలాంటి సమయం రావొచ్చన్న ఆమె భర్త
కేరళలోని వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికల ఫలితం వెలువడింది. మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి దిగిన కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా ఫలితాల్లో జోరు కనబర్చారు. తన సమీప బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్‌పై సుమారు 3.94 లక్షల ఓట్ల మెజారిటీ సాధించి విజయఢంకా మోగించారు. ఈ నేపథ్యంలో ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా స్పందించారు. ప్రియాంక కృషిని గుర్తించిన వయనాడ్ ప్రజలకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆమె కచ్చితంగా భారీ మెజారిటీ విజయం సాధిస్తారు. ప్రజా సమస్యలను పార్లమెంటులో వినిపించడానికి శ్రమిస్తారు. ప్రస్తుతం ప్రియాంక పుస్తకాలు చదవడం, పిల్లల్ని చూసుకోవడంలో బిజీగా ఉన్నారు. దేశ ప్రజలకు సేవ చేయాలనే ఆశయంతో ఆమె ఈ ఎన్నికల బరిలో దిగారు. ఫలితాల సరళిలో ప్రియాంక ముందంజలో ఉండటంపై ఆమె హర్షం వ్యక్తం చేస్తున్నారని విలేకరులతో పేర్కొన్నారు.
రాజకీయాల్లో చురుకుగా పాల్గొనడంపై అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. ప్రజల కోసం నేను శ్రమిస్తూనే ఉంటా. అలాంటప్పుడు పార్లమెంటులోనే ఉండాల్సిన అవసరం లేదన్నారు. ప్రియాంక పార్లమెంటులో ప్రజల గళాన్ని వినిపించనున్నారు. నాకూ అలాంటి సమయం రావొచ్చు. ప్రజలు ఏం కోరుకుంటారో అదే జరుగుతుందని వ్యాఖ్యానించారు. మరోవైపు మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికల ఫలితాల సరళిపై ఆయన స్పందించారు. మహారాష్ట్ర ఫలితాల నుంచి పాఠాలు నేర్చుకోవాలి. ప్రజల తీర్పును గౌరవించాలి. గెలిచిన పార్టీతో కలిసి రాష్ట్రాభివృద్ధికి పాటుపడాలి. ఝార్ఖండ్ ఫలితాలపై సంతోషంగా ఉన్నది. ఈడీ, ఇతర సంస్థలను ఉపయోగించి అధికారపార్టీకి బీజేపీ ఇబ్బందులు సృష్టించింది. అయినా ప్రజలు సరైన నిర్ణయం తీసుకున్నారని రాబర్ట్ వాద్రా అన్నారు.