మూడేళ్లలో యమునా నదిని ప్రక్షాళన చేస్తాం
ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ హామీ
మరో పది రోజుల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుండగా ఓటర్లను ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలు వాళ్లపై హామీల జల్లు కురిపిస్తున్నాయి. బీజేపీ ఎన్నికల మేనిఫస్టో 'సంకల్ప పత్ర -3'ని శనివారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా విడుదల చేశారు. ఢిల్లీలో బీజేపీని గెలిపించి అధికారమిస్తే మూడేళ్లలోనే యమునా నదిని ప్రక్షాళన చేస్తామని హామీ ఇచ్చారు. తమ మేనిఫెస్టోలో ఒక్క బూటకపు హామీ కూడా లేదని షా ప్రకటించారు. ఢిల్లీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడంలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రజలకు కనీసం సరైన తాగునీరు కూడా సరఫరా చేయడం లేదన్నారు. కేంద్రం నుంచి ఢిల్లీ అభివృద్ధికి ఎంతో కృషి చేశామన్నారు. రూ.41 వేల కోట్లతో రోడ్లు నిర్మించామని, రైల్వే లైన్ల కోసం రూ.15 వేల కోట్లు, ఎయిర్ పోర్టుకు రూ.12 వేల కోట్లు కేంద్రం నుంచి అందజేశామన్నారు. గిగ్ వర్కర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఢిల్లీలోని 1,700 అనధికార కాలనీల్లో ప్లాట్ల అమ్మకాలు, కొనుగొళ్లకు అవకాశం ఇవ్వడంతో పాటు ఆయా కాలనీల్లో చేపట్టిన ఇండ్లకు పూర్తి యాజమాన్య హక్కులు కల్పిస్తామని తెలిపారు. ప్రజలకు రూ.10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్, రూ.5 లక్షల యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ సదుపాయం కల్పిస్తామని తెలిపారు. 20 లక్షల మందికి స్వయం ఉపాధి కల్పించడంతో పాటు 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలను అత్యంత పారదర్శకంగా భర్తీ చేస్తామన్నారు.