Telugu Global
National

ఏపీ ప్రజల ప్రేమాభిమానాలతోనే మూడోసారి అధికారంలోకి వచ్చాం

రాష్ట్రాభివృద్ధికి అన్నిరంగాల్లో మద్దతునిస్తాం : ప్రధాని నరేంద్రమోదీ

ఏపీ ప్రజల ప్రేమాభిమానాలతోనే మూడోసారి అధికారంలోకి వచ్చాం
X

ఏపీ ప్రజల ప్రేమాభిమానాలతోనే తాము మూడోసారి అధికారంలోకి వచ్చామని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఏపీ ప్రజల ప్రేమాభిమానాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 60 ఏళ్ల తర్వాత మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు సహకరించిన ఏపీ అభివృద్ధికి అన్నిరకాలుగా తోడ్పాటునందిస్తున్నామని అన్నారు. వైజాగ్‌లోని ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్‌ కాలేజీ గ్రౌండ్‌ లో రూ.2.08 లక్షల కోట్లతో చేపట్టబోయే పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన అనంతరం మాట్లాడారు. ఏపీ సీఎం చంద్రబాబు నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనకు తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. 2047 నాటికి ఏపీ 2.5 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీని లక్ష్యంగా పెట్టుకుందని.. కేంద్రం ఏపీతో భుజం కలిపి నడస్తుందన్నారు. ఈ రోజు తాము తలపెట్టిన ప్రాజెక్టులు ఏపీ అభివృద్ధి, వికాసానికి అండగా నిలుస్తాయన్నారు. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీకి ఏపీ హెడ్‌ క్వార్టర్స్‌ కాబోతుందన్నారు. ఏపీలో తలపెట్టిన ప్రాజెక్టులు సరికొత్త శిఖరాలకు చేరుతాయన్నారు.

రాబోయే ఆరేళ్లలో 5 మిలియన్‌ టన్నుల గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తి తమ లక్ష్యమన్నారు. దేశంలో రెండు గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌ లు వస్తుంటే అందులో ఒకటి విశాఖపట్నానికి కేటాయించామన్నారు. దీనిద్వారా స్థానిక యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. నక్కలపల్లి బల్క్‌ డ్రగ్‌ ఇండస్ట్రీ, చెన్నై - బెంగళూరు ఇండస్ట్రియల్‌ కారిడార్‌ లో ఇది భాగమవుతుందన్నారు. ఇప్పటికే శ్రీసిటీ ద్వారా ఏపీలో ఉత్పాదకరంగం ఊపందుకుందని చెప్పారు. సౌత్‌ కోస్టర్‌ రైల్వే జోన్‌ కు పునాది రాయి వేశామని.. ఏపీ అభివృద్ధిలో ఇది కీలకం కాబోతుందన్నారు. తమకు రైల్వే జోన్‌ కావాలన్న ఆంధ్రప్రదేశ్‌ ప్రజల చిరకాల వాంఛ నెరవేరుతుందని అన్నారు. దీని ద్వారా వ్యవసాయంతో పాటు టూరిజం రంగం ఎంతగానో అభివృద్ధి చెందుతుందన్నారు. ఏపీలో ఇప్పటికే ఏడు వందే భారత్‌ రైళ్లు నడుస్తున్నాయని.. అమృత్‌ భారత్‌ లో భాగంగా ఏపీలో 70కి పైగా రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నామని తెలిపారు. సమావేశంలో గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌, కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

First Published:  8 Jan 2025 8:13 PM IST
Next Story