మరో భాషా యుద్ధం చేయడానికి మేం సిద్ధం
లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన అంశం దక్షిణాది రాష్ట్రాలపై వేలాడుతన్న కత్తి అని వ్యాఖ్యానించిన స్టాలిన్

లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ స్పందించారు. ఈ అంశం దక్షిణాది రాష్ట్రాలపై వేలాడుతన్న కత్తి అని వ్యాఖ్యానించారు. చెన్నైలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనపై చర్చించడానికి మార్చి 5న అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. జనాభాను నియంత్రించడం భారత్ ముందున్న అతి పెద్ద లక్ష్యం. ఇందులో తమిళనాడు విజయం సాధించింది. అయితే తక్కువ జనాభా ఉండటం వల్ల పార్లమెంటు సీట్లు తగ్గే అవకాశం ఉన్నది. ఈ పరిస్థితి రాష్ట్రంలో ఎదుర్కొంటున్నది. ఒకవేళ సీట్లు తగ్గితే.. 39 కాకుండా 31 మంది ఎంపీలు మాత్రమే ఉంటారని పేర్కొన్నారు.
జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ)లో భాగమైన త్రిభాష సూత్రం అమలుపై తమిళనాడు-కేంద్ర ప్రభుత్వాల మధ్య వివాదం కొనసాగుతున్న విషయం విదితమే. ఈ అంశాన్ని ఉద్దేశిస్తూ స్టాలిన్ మరోసారి మాట్లాడారు. మరో భాషా యుద్ధం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. కాగా.. నూతన విద్యా విధానం ద్వారా హిందీని బలవంతంగా రుద్దుతున్నారంటూ.. రాష్ట్రానికి రావాల్సిన నిధులను నిలిపివేశారని గతంలో స్టాలిన్ ప్రభుత్వం ఆరోపించింది. భాషలను రాజకీయ కోణంలో చూడవద్దంటూ కేంద్రాన్ని కోరింది.