భద్రతలో మనం అదృష్టవంతులం కాదు
శత్రువుల కార్యకలాపాలపై మరింత నిఘా అవసరం. వారి కదలికలను గమనిస్తూనే ఉండాలన్న రక్షణశాఖ మంత్రి

భారత భద్రతా వ్యవస్థపై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆసక్తకర వ్యాఖ్యలు చేశారు. భద్రత విషయంలో మనం అంత అదృష్టవంతులం కాదన్నారు. బాహ్యంగా, అంతర్గతంగా శత్రువుల కదలికలపై దృష్టి సారించాలని సైన్యానికి సూచించారు. మధ్యప్రదేశ్ ఇండోర్ జిల్లాలోని మావ్ కంటోన్మెంట్ వద్ద ఆర్మీ సిబ్బందిని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
దేశ భద్రతను పరిగణనలోకి తీసుకుంటే మనం అంత అదృష్టవంతులం కాదు. ఎందుకంటే.. ఉత్తర, పశ్చిమ సరిహద్దు ప్రాంతాల్లో నిత్యం సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తున్నది. అంతేకాకుండా.. అంతర్గతంగానూ భద్రతాపరమైన ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నాం. ఈ పరిస్థితి పట్ల ఆందోళన లేకుండా నిశ్శబ్దంగా కూర్చోలేం. శత్రువుల కార్యకలాపాలపై మరింత నిఘా అవసరం. వారి కదలికలను గమనిస్తూనే ఉండాలి. అప్పుడే వారి కుట్రను భగ్నం చేయగలమని రాజ్‌నాథ్ సింగ్ ఆర్మీ సిబ్బందికి సూచించారు.
భారత్ అభివృద్ధి ప్రయాణంలో సైన్యం పాత్ర కీలకమని అన్నారు. రక్షణమంత్రిగా నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను ఇక్కడికి వచ్చినప్పుడల్లా మీరు తీసుకుంటున్న కఠినమైన శిక్షణత పాటు మీ అంకితభావాన్ని చూశాను. దేశం పట్ల బాధ్యతాయుతమైన మీ తీరు .. మాలో స్ఫూర్తి నింపుతున్నదని అన్నారు.