Telugu Global
National

కేరళ విపత్తులో మృతుల సంఖ్య 107– శిథిలాలు తొలగిస్తున్న కొద్దీ పెరుగుతున్న మృతుల సంఖ్య

కేరళలో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఘోర విపత్తులో మృతుల సంఖ్య సాయంత్రానికి 107కు చేరింది.

కేరళ విపత్తులో మృతుల సంఖ్య 107– శిథిలాలు తొలగిస్తున్న కొద్దీ పెరుగుతున్న మృతుల సంఖ్య
X

కేరళలో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఘోర విపత్తులో మృతుల సంఖ్య సాయంత్రానికి 107కు చేరింది. భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటనలో పలు ప్రాంతాలు తుడిచిపెట్టుకుపోవడం గమనార్హం. వందల సంఖ్యలో వాహనాలు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. 400 కుటుంబాలు ఈ ప్రమాదంలో చిక్కుకున్నట్టు తెలుస్తోంది. సహాయ బృందాలు శిథిలాలను తొలగించేకొద్దీ మృతదేహాల సంఖ్య పెరుగుతూనే ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.

వయనాడ్‌ జిల్లాలోని మెప్పాడి, ముండకై, చురల్‌మల ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఈ విపత్తులో అనేకమంది శిథిలాల కింద చిక్కుకొని సాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్న దయనీయ దృశ్యాలు కనిపిస్తున్నాయి. అర్ధరాత్రి వేళ అందరూ నిద్రలో ఉన్న సమయంలో ఊహించని విధంగా కొండచరియలు విరిగి పడటంతో ఎవరూ తప్పించుకొనేందుకు అవకాశం లేకుండా పోయిందని అధికారులు చెబుతున్నారు. మరోపక్క వరద, బురద ప్రవాహంతో వందల మంది కొట్టుకుపోయారని, వారి కోసం సహాయ బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. డ్రోన్లు, జాగిలాల సాయంతో సహాయబృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ఈ ఘటన నేపథ్యంలో కేరళ రాష్ట్ర ప్రభుత్వం రేపటి నుంచి రెండురోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించింది.

First Published:  30 July 2024 9:33 PM IST
Next Story