ఎవరైనా కూరగాయాలు కోసే కత్తితో బైపాస్ సర్జరీ చేయాలనుకుంటారా?
ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్
తనపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానంపై రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ మొదటిసారి బహిరంగంగా స్పందించారు. ఈ సందర్భంగా విపక్షాలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బైపాస్ సర్జరీ కోసం కూరగాయలు కోసే కత్తిని ఉపయోగించకూడదు కదా అంటూ వ్యాఖ్యానించారు.
ఉపరాష్ట్రపతికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన ఆ తీర్మానాన్ని చూడండి. దాన్ని చూసి ఎంతో ఆశ్చర్యపోయాను. ఎవరైనా కూరగాయాలు కోసే కత్తితో బైపాస్ సర్జరీ చేయాలనుకుంటారా? అని గతంలో మాజీ ప్రధాని చంద్రశేఖర్ అన్నారు. ఆయన అన్నట్లుగా అలాంటి కత్తితో ఎవరూ అలా చేయరు. ఆ నోటీసులు కనీసం కూరగాయలు కోసే కత్తి కూడా కాదు. పూర్తిగా తప్పుపట్టింది. కాంగ్రెస్ నాకు వ్యతిరేకంగా చేస్తున్న అసత్య ప్రచానాకి వ్యక్తిగతంగా ఎంతో బాధపడ్డాను. కానీ నేను రైతు బిడ్డను.. ఎప్పటికీ బలహీనపడను అని మహిళా విలేకర్లతో మాట్లాడుతూ ధన్‌ఖడ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ నెల 10వ తేదీన కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి జగదీప్ ధన్‌ఖడ్‌పై అవివ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన విషయం విదితమే. ఛైర్మన్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని, ఆయనపై నమ్మకం లేదని ఆరోపించింది. ఈ అవిశ్వాస తీర్మానానికి తృణమూల్ కాంగ్రెస్, ఆప్‌ల నుంచి 60 మంది ఇండియా కూటమి నేతలు మద్దతు ఇచ్చినట్లు సమాచారం. అయితే దీన్ని డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ తిరస్కరించారు.