Telugu Global
National

యూపీఎస్సీ చైర్మన్ రాజీనామా.. కారణం ఏంటంటే..?

యూపీఎస్సీ చైర్మన్ రాజీనామా చేయడంతో పూజా ఖేడ్కర్ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. నియామక ప్రక్రియలో లోపాలు ఉన్నట్టు బట్టబయలు కావడంతో చైర్మన్ రాజీనామా చేశారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

యూపీఎస్సీ చైర్మన్ రాజీనామా.. కారణం ఏంటంటే..?
X

ఇటీవల నీట్ పేపర్ లీక్ కావడం, యూజీసీ నెట్ పరీక్ష రద్దవడం వంటి వ్యవహారాలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. విద్యార్థుల భవిష్యత్ ని ప్రశ్నార్థకం చేశారని, పేపర్ లీకేజీలతో వారి సమయం వృథా చేశారంటూ కేంద్రంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఆ తర్వాత యూపీఎస్సీ పేరు టాక్ ఆఫ్ ది నేషన్ గా మారింది. పూజా ఖేడ్కర్ అనే అమ్మాయి తప్పుడు సర్టిఫికెట్లతో సివిల్స్ పరీక్ష రాసి ఎంపిక కావడం, ట్రైనింగ్ లో ఆమె తప్పులు చేసి దొరికిపోవడంతో యూపీఎస్సీ నియామక ప్రక్రియపై సందేహాలు మొదలయ్యాయి. తాజాగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మనోజ్ సోనీ రాజీనామాతో మరోసారి కమిషన్ వార్తల్లోకెక్కింది. ఐదేళ్ల పదవీకాలం ఉండగానే ఆయన రాజీనామా చేయడం సంచలనంగా మారింది.

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) ఛైర్మన్‌ మనోజ్‌ సోనీ తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గతేడాది ఏప్రిల్‌ లోనే ఆయన చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు. ఆయనకు ఐదేళ్ల పదవీకాలం ఉంది. అయినా కూడా ఆయన రాజీనామా చేయడం గమనార్హం. ఆయన రాజీనామాను ఉన్నతాధికారులు ఇంకా ఆమోదించలేదు.

యూపీఎస్సీ చైర్మన్ రాజీనామా చేయడంతో పూజా ఖేడ్కర్ వ్యవహారం తెరపైకి వచ్చింది. నియామక ప్రక్రియలో లోపాలు ఉన్నట్టు బట్టబయలు కావడంతో చైర్మన్ రాజీనామా చేశారంటూ పుకార్లు షికార్లు చేశాయి. కానీ పూజా ఎంపికకు, ఈ రాజీనామాకు సంబంధం లేదని కమిషన్ వర్గాల సమాచారం. కానీ గతంలో ఎప్పుడూ లేనట్టుగా యూపీఎస్సీని కూడా తప్పుడు సర్టిఫికెట్లతో బురిడీ కొట్టించ వచ్చని పూజా ఖేడ్కర్ నిరూపించారు. ఓబీసీ అర్హత లేకపోయినా ఆమె క్రీమీ లేయర్ సర్టిఫికెట్ సంపాదించారు, అంగవైకల్యం ఉన్నట్టు మరో తప్పుడు సర్టిఫికెట్ సృష్టించారు. వీటిని యూపీఎస్సీ పసిగట్టలేకపోవడం, ఆమె ఏకంగా శిక్షణకు ఎంపిక కావడం ఆశ్చర్యకరం. ఆ సంఘటనకు, ఈ రాజీనామాకు సంబంధం ఉందా లేదా అనేది తేలాల్సి ఉంది.

First Published:  20 July 2024 5:02 AM GMT
Next Story