Telugu Global
National

బుల్డోజర్‌ రాజ్‌ లోనే కాదు అట్రాసిటీ కేసుల్లోనూ యూపీనే టాప్‌

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో మొదటి రెండు స్థానాల్లో బీజేపీ పాలిత రాష్ట్రాలే

బుల్డోజర్‌ రాజ్‌ లోనే కాదు అట్రాసిటీ కేసుల్లోనూ యూపీనే టాప్‌
X

బుల్డోజర్‌ రాజ్‌ లోనే కాదు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లోనే ఉత్తర ప్రదేశ్‌ టాప్‌ లో ఉంది. 2022లో నమోదైన కేసుల డేటాను పరిశీలిస్తే కేవలం 13 రాష్ట్రాల్లోనే 98 శాతం కేసులు రికార్డు అయ్యాయి. అట్రాసిటీ కేసులు ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రాల్లో మొదటి రెండు స్థానాల్లోనూ బీజేపీ ప్రభుత్వాలే ఉన్నాయి. 2022లో దేశవ్యాప్తంగా 51,656 ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయితే అందులో 12,287 కేసులు ఒక్క ఉత్తర ప్రదేశ్‌ లోనే నమోదయ్యాయి. 8,651 కేసులతో రాజస్థాన్‌ సెకండ్‌ ప్లేస్‌ లో ఉండగా, 7,732 కేసులతో మధ్యప్రదేశ్‌ మూడో ప్లేస్‌ లో ఉన్నాయి. బిహార్‌ లో 6,799, ఒడిశాలో 3,576, మహారాష్ట్రలో 2,706 కేసులు నమోదయ్యాయి. కేవలం ఈ రాష్ట్రాల్లోనే 81 శాతం అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. అట్రాసిటీ కేసులు నమోదవుతున్నా వాటిని నిరూపించే సాక్ష్యాధారాలను సేకరించి, నిందితులకు శిక్ష పడేలా చేయడంలో ప్రాసిక్యూషన్‌ విఫలమవుతున్నట్టుగా గణాంకాలు చెప్తున్నాయి. నమోదవుతున్న అట్రాసిటీ కేసుల్లో కొందరిని టార్గెట్‌ చేసే ఉద్దేశంతో తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నట్టుగా రికార్డులు పేర్కొంటున్నాయి. 14.78 శాతం కేసులు తప్పుడు ఫిర్యాదుల కారణంగా సరైన సాక్ష్యాలు లేవని చెప్తూ ప్రాసిక్యూషన్‌ విచారణను ముగించింది. నమోదవుతున్న అట్రాసిటీ కేసుల్లో కేవలం 32.4 శాతం కేసులే నిరూపణ అయ్యాయి. 2020తో పోల్చితే నిరూపణ అవుతున్న కేసులు 6.8 శాతం తగ్గిపోయాయి.

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను వేగంగా విచారించేందుకు 14 రాష్ట్రాల్లో గల 498 జిల్లాల్లో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేశారు. ఎస్సీ, ఎస్టీలపై ఎక్కువగా దాడులు జరుగుతున్న ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేశారు. దేశంలోనే ఎక్కువ అట్రాసిటీ కేసులో ఉత్తర ప్రదేశ్‌ టాప్‌ ప్లేస్‌ లో ఉన్నప్పటికీ అక్కడ ప్రత్యేకంగా అట్రాసిటీ జోన్లు అంటూ ఏమి గుర్తించలేదు. ఏపీ, అసోం, బిహార్‌, ఛత్తీస్‌ గఢ్‌, గుజరాత్‌, హర్యానా, హిమచల్‌ ప్రదేశ్‌, జార్ఖండ్‌, కర్నాటక, కేరళ, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, మేఘాలయ, మిజోరాం, ఒడిశా, పంజాబ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో ఎస్సీ, ఎస్టీ ప్రొటెక్షన్‌ సెల్‌ లు పని చేస్తున్నాయి. సిక్కిం, తమిళనాడు, తెలంగాణ, త్రిపుర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, అండమాన్ - నికోబార్ దీవులు, చండీగఢ్, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, లడఖ్, పుదుచ్చేరి, బిహార్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, కేరళ, మధ్యప్రదేశ్‌ లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులపై ఫిర్యాదులు, విచారణకు ప్రత్యేక పోలీస్‌ స్టేషన్లు ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీలపై సామాజికంగా వివక్ష చూపడం, దాడులు చేయడం, అణచివేత, అత్యాచారాలను నియంత్రించడానికి ప్రివెన్షన్‌ ఆఫ్‌ అట్రాసిటీస్‌ యాక్ట్‌, 1989 ఏర్పాటు చేశారు. దళితులు, గిరిజనులు, ఆదివాసీలపై అత్యాచారాలు, దాడుల నియంత్రణకు ఉద్దేశించిన గొప్ప చట్టాన్ని కొందరు వ్యక్తిగత కక్షసాధింపులకు ఉపయోగించడంతో ఈ చట్టంపై ఆరోపణలు వస్తున్నాయి. ఫలితంగానే నమోదవుతున్న కేసుల్లో నిరూపణ అయ్యే కేసుల సంఖ్య తగ్గిపోతుందని దళిత, గిరిజన ఉద్యమకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

First Published:  23 Sept 2024 11:19 AM GMT
Next Story