హర్యానా బీజేపీ అబ్జర్వర్ గా అమిత్ షా
నాయబ్ సింగ్ షైనీనే సీఎంగా ఎంపిక చేసే చాన్స్
హర్యానాలో హ్యాట్రిక్ విజయం దక్కించుకున్న బీజేపీ సీఎం ఎంపిక విషయంలోనూ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ ను హర్యానా బీజేపీ పరిశీలకులుగా నియమించింది. అమిత్ షాను బీజేపీ అధినాయకత్వం ఒక రాష్ట్ర లెజిస్లేటివ్ మీటింగ్ కు ముందు అబ్జర్వర్ గా నియమించడం ఇదే మొదటిసారి. అమిత్ షాతో పాటు మధ్య ప్రదేశ్ సీఎం హర్యానా పరిశీలకులుగా నియమితులయ్యారు అంటే మరోసారి నాయబ్ సింగ్ షైనీనే ముఖ్యమంత్రిగా నియమించనున్నట్టు తెలుస్తోంది. బీజేపీ ఎల్పీ మీటింగ్ కు హాజరై పార్టీ హైకమాండ్ చాయిస్ షైనీ అనే విషయాన్ని అమిత్ షా తేటతెల్లం చేయనున్నట్టు తెలుస్తోంది. హర్యానాలో కాంగ్రెస్ విజయం తథ్యమని కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మార్చిలోనే ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడుగా ఉన్న షైనీని సీఎంగా నియమించింది. ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించి బీజేపీని విజయ తీరాలకు చేర్చడంతో షైనీ సక్సెస్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే షైనీకి మరో అవకాశం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.