Telugu Global
National

Union Budget 2025 | బడ్జెట్‌లో న‌వ‌ర‌త్నాలు.. ఆయ‌న రికార్డును బ్రేక్ చేయ‌నున్న నిర్మ‌ల‌మ్మ‌..!

2019లో న‌రేంద్ర‌మోడీ సార‌థ్యంలోని ఎన్డీఏ కూట‌మి ప్ర‌భుత్వం రెండోసారి అధికారం చేప‌ట్టిన‌ప్ప‌టి నుంచి ఆరు బ‌డ్జెట్లను పార్ల‌మెంట్‌కు స‌మ‌ర్పించారు.

Union Budget 2025 | బడ్జెట్‌లో న‌వ‌ర‌త్నాలు.. ఆయ‌న రికార్డును బ్రేక్ చేయ‌నున్న నిర్మ‌ల‌మ్మ‌..!
X

Union Budget 2025 | కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ పేరిట స‌రికొత్త రికార్డు న‌మోదు కాబోతున్న‌ది. వ‌రుస‌గా ఏడో బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టిన రికార్డును నిర్మ‌లా సీతారామ‌న్ సొంతం చేసుకోబోతున్నారు. 2024-25 ఆర్థిక సంవ‌త్స‌రానికి కేంద్ర బ‌డ్జెట్‌ను మంగ‌ళ‌వారం పార్ల‌మెంట్‌లో ప్ర‌వేశ పెడ‌తారు. 2019లో న‌రేంద్ర‌మోడీ సార‌థ్యంలోని ఎన్డీఏ కూట‌మి ప్ర‌భుత్వం రెండోసారి అధికారం చేప‌ట్టిన‌ప్ప‌టి నుంచి ఆరు బ‌డ్జెట్లను పార్ల‌మెంట్‌కు స‌మ‌ర్పించారు. వ‌రుస‌గా ఐదు వార్షిక బ‌డ్జెట్లతోపాటు గ‌త ఫిబ్ర‌వ‌రిలో తాత్కాలిక బ‌డ్జెట్‌ను ప్ర‌వేశపెట్టారు. ఇంత‌కుముందు 1959 నుంచి 1964 వ‌ర‌కూ వ‌రుస‌గా ఐదు పూర్తిస్థాయి బ‌డ్జెట్లు, ఒక తాత్కాతిక బ‌డ్జెట్ ప్ర‌వేశ పెట్టిన ఘ‌న‌త మాజీ ప్ర‌ధాని మొరార్జీ దేశాయ్ సొంతం చేసుకున్నారు.


బ‌డ్జెట్ స‌మ‌ర్ప‌ణ‌లో న‌వ‌ర‌త్నాలు

1947లో తొలి బ‌డ్జెట్‌కు శ్రీకారం

భార‌త‌దేశానికి స్వాతంత్య్రం వ‌చ్చిన త‌ర్వాత మూడు నెల‌ల‌కు 1947 న‌వంబ‌ర్ 26న అప్ప‌టి కేంద్ర మంత్రి ఆర్‌కే ష‌ణ్ముఖం తొలి బ‌డ్జెట్‌ను పార్లమెంట్‌కు స‌మ‌ర్పించారు. త‌ద్వారా చారిత్ర‌క మైలురాయి నెల‌కొల్పారు.

అత్య‌ధిక బ‌డ్జెట్లు స‌మ‌ర్పించిన ఘ‌న‌త ఆయ‌న సొంతం

దేశానికి స్వాతంత్య్రం వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి మాజీ ప్ర‌ధాని మొరార్జీ దేశాయ్ అత్య‌ధిక వార్షిక బ‌డ్జెట్‌లు స‌మ‌ర్పించారు. భార‌త తొలి ప్ర‌ధాని జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ, రెండో ప్ర‌ధాని లాల్ బ‌హ‌దూర్ శాస్త్రి హ‌యాంలో మొరార్జీ దేశాయ్ 10 వార్షిక బ‌డ్జెట్లు పార్ల‌మెంటులో ప్ర‌వేశ‌పెట్టారు. తొలిసారి మొరార్జీ దేశాయి 1959 ఫిబ్ర‌వ‌రి 28న తొలి బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ పెట్ట‌డంతో త‌న వార‌స‌త్వాన్ని ప్రారంభించారు. అలా త‌దుప‌రి రెండేండ్లు వ‌రుస‌గా పూర్తిస్థాయి బ‌డ్జెట్ల‌ను పార్ల‌మెంట్‌కు స‌మ‌ర్పించారు. 1962లో తాత్కాలిక బ‌డ్జెట్, తిరిగి మ‌ళ్లీ 1967 నుంచి 1969 వ‌ర‌కూ మూడేండ్లు వ‌రుస పూర్తిస్థాయి బ‌డ్జెట్లు స‌మ‌ర్పించారు.

న‌వ‌ర‌త్నాల‌తో త‌ర్వాతీ ప్లేస్ చిదంబ‌రానిదే

కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబ‌రం తొమ్మిది పూర్తిస్థాయి బ‌డ్జెట్ల‌ను పార్ల‌మెంట్‌కు స‌మ‌ర్పించారు. హెచ్‌డీ దేవెగౌడ సార‌థ్యంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్ర‌భుత్వ హ‌యాంతోపాటు కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో యూపీఏ ప్ర‌భుత్వంలో క‌లిపి తొమ్మిది వార్షిక బ‌డ్జెట్‌లు ప్ర‌వేశ‌పెట్టిన ఘ‌న‌త సొంతం చేసుకున్నారు.

తృతీయ స్థానంలో ప్ర‌ణ‌బ్ దా..

కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ ఆర్థిక మంత్రిగా ఎనిమిది వార్షిక బ‌డ్జెట్ల‌ను పార్ల‌మెంట్‌కు స‌మ‌ర్పించారు. 1980వ ద‌శ‌కం నుంచి 2012 వ‌ర‌కూ కాంగ్రెస్‌, కాంగ్రెస్ పార్టీ సార‌థ్యంలోని యూపీఏ ప్ర‌భుత్వ హ‌యాంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. ప్ర‌త్యేకించి 2004-14 మ‌ధ్య యూపీఏ ప్ర‌భుత్వ హ‌యాంలో ఆయ‌న పాత్ర కీల‌కంగా ఉంది. ఆర్థిక విధానాల రూప‌క‌ల్ప‌న‌లో గ‌ణ‌నీయ పాత్ర పోషించారు.

సంస్క‌ర‌ణ‌ల రూప‌శిల్పి మ‌న్మోహ‌న్‌..

మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ వ‌రుస‌గా ఐదు వార్షిక బ‌డ్జెట్ల‌ను పార్లమెంట్‌కు స‌మ‌ర్పించారు. 1991-96 మ‌ధ్య ఐదు పూర్తిస్థాయి బ‌డ్జెట్ల‌ను పార్ల‌మెంట్‌లో ప్ర‌వేశ పెట్టారు. 1996లో సార్వ‌త్రిక ఎన్నిక‌ల కోసం ఓటాన్ అకౌంట్ బ‌డ్జెట్ స‌మ‌ర్పించారు. మాజీ ప్ర‌ధాని పీవీ న‌ర్సింహారావు ప్ర‌భుత్వ హ‌యాంలో దేశంలో ఆర్థిక సంస్క‌ర‌ణ‌ల‌కు శ్రీ‌కారం చుట్టి.. దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు చుక్కానిలా నిలిచారు.

బ‌డ్జెట్ ప్ర‌సంగాలిలా

2020-21 ఆర్థిక సంవ‌త్స‌రానికి 2020 ఫిబ్ర‌వ‌రి ఒక‌టో తేదీన పార్ల‌మెంట్‌లో బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టిన ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ఎక్కువ సేపు ప్ర‌సంగించారు. తమ ప్ర‌భుత్వ హ‌యాంలో చేప‌ట్టిన ఆర్థిక సంస్క‌ర‌ణలు, ద్ర‌వ్య విధానాల‌ను సోదాహ‌ర‌ణంగా వివ‌రిస్తూ 2.40 గంట‌ల సేపు ప్ర‌సంగించారు. ఇప్ప‌టి వ‌ర‌కూ అత్య‌ధిక స‌మ‌యం బడ్జెట్ ప్ర‌సంగం చేసిన ఆర్థిక మంత్రి అన్న రికార్డును నిర్మ‌లా సీతారామ‌న్ సొంతం చేసుకున్నారు.

అంత‌కుముందు 1977లో నాటి ఆర్థిక మంత్రి హిరూభాయి ముల్జీబాయ్ ప‌టేల్ తాత్కాలిక బ‌డ్జెట్‌ను పార్ల‌మెంట్‌కు స‌మ‌ర్పించారు. కేవ‌లం 800 ప‌దాల ప్ర‌సంగంతోనే హిరూభాయ్ ముల్టీబాయ్ ప‌టేల్ త‌న స్పీచ్ ముగించారు.

చారిత్ర‌క టైం షిఫ్టింగ్‌

బ్రిటిష్ ప్ర‌భుత్వ హయాం నుంచి ప్రతి ఏటా ఫిబ్ర‌వ‌రి 28 సాయంత్రం ఐదు గంట‌ల‌కు పార్ల‌మెంట్‌కు కేంద్ర ఆర్థిక మంత్రి బ‌డ్జెట్ స‌మ‌ర్పించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తుంది. బ్రిట‌న్ స‌మ్మ‌ర్ టైం 4.30 గంట‌ల‌కు (భార‌త్‌లో సాయంత్రం ఐదు గంట‌ల‌కు) కేంద్ర బ‌డ్జెట్ స‌మ‌ర్పించే వారు. కానీ 1999లో అప్ప‌టి అట‌ల్ బిహారీ వాజ్‌పేయి సార‌థ్యంలోని ఎన్డీఏ ప్ర‌భుత్వంలో ఆర్థిక మంత్రిగా య‌శ్వంత్ సిన్హా బ‌డ్జెట్ స‌మ‌ర్ప‌ణ స‌మ‌యాన్ని ఫిబ్ర‌వ‌రి 28 ఉద‌యం 11 గంట‌ల‌కు మార్చేశారు.

బ‌డ్జెట్ తేదీలో మార్పు ఇలా

2014లో బీజేపీ నేత న‌రేంద్ర‌మోడీ సార‌థ్యంలోని ఎన్డీఏ ప్ర‌భుత్వం కొలువు దీరిన త‌ర్వాత మూడేండ్ల‌కు 2017 బడ్జెట్ స‌మ‌ర్పించే తేదీని మార్చేశారు. బ‌డ్జెట్‌కు మార్చి నెలాఖ‌రు నాటికి పార్ల‌మెంట్ ఆమోద ప్ర‌క్రియ త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేసేందుకు 2017లో అప్ప‌టి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ.. 2017-18 ఆర్థిక సంవ‌త్స‌ర బ‌డ్జెట్‌ను ఫిబ్ర‌వ‌రి ఒక‌టో తేదీకి మార్చేశారు. దీనివ‌ల్ల ఏప్రిల్‌లో ఆర్థిక సంవ‌త్స‌రం ప్రారంభ‌మ‌య్యే నాటికి బ‌డ్జెట్‌కు ఆమోదం ల‌భిస్తుంది. ఇంత‌కుముందు ఫిబ్ర‌వ‌రి 28 లేదా 29న బ‌డ్జెట్ స‌మ‌ర్పిస్తే దానికి పార్ల‌మెంట్ ఆమోదం కోసం మే, జూన్ వ‌ర‌కూ వేచి ఉండాల్సి వ‌చ్చేది. ఈ మ‌ధ్య‌కాలంలో ప్ర‌భుత్వ ప‌ద్దులకు ఆమోదం తెలిపేవారు.

First Published:  22 July 2024 8:02 AM GMT
Next Story