Telugu Global
National

ఏకపక్షంగా బుల్డోజర్‌ కూల్చివేతలు తగవు

నిందితుల ఆస్తుల కూల్చివేతపై సుప్రీం కీలక తీర్పు. రాష్ట్రాలు, అక్కడ పనిచేసే అధికారులు మితిమీరిన చర్యలు తీసుకోవద్దని ఆదేశం

ఏకపక్షంగా బుల్డోజర్‌ కూల్చివేతలు తగవు
X

బుల్డోజర్‌ న్యాయం పేరుతో చేపడుతున్న నేరస్థుల ఆస్తులపై కూల్చివేతపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. వివిధ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల ఆస్తులను బుల్డోజర్లతో కూల్చివేయడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై బుధవారం తీర్పు వెలువరించింది. ఏకపక్షంగా ఆస్తులను కూల్చివేయడం చట్టాన్ని ఉల్లంఘించడమేనని ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం ప్రకటించింది.కార్యనిర్వాహక అధికారులు ఒక వ్యక్తిని దోషిగా ప్రకటించలేరని పేర్కొన్నది. ఆయన న్యాయమూర్తిగా మారలేడని చెప్పింది. నిందితుల ఆస్తులను కూల్చివేయాలని కార్యనిర్వాహక అధికారులు నిర్ణయించలేని తేల్చిచెప్పింది. రాష్ట్రాలు, అక్కడ పనిచేసే అధికారులు మితిమీరిన చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. జడ్జిలా వ్యవహరించి నిందితుల స్థిరాస్థులను కూల్చివేయడం తగదని తీర్పు చెప్పింది. అన్ని రాష్ట్రాల్లోనూ చట్టబద్ధమైన పాలన ఉండాలని, ఎలాంటి ప్రక్రియ లేకుండా ఎలాంటి ఆస్తిని స్వాధీనం చేసుకోరాదని, ధ్వంసం చేయకూడదని కోర్టు ఉద్ఘాటించింది. కోర్టు ఆదేశాలు ఉల్లంఘిస్తే ధిక్కార చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ధర్మాసనం హెచ్చరించింది. కూల్చివేత ప్రక్రియలో నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే, ఆ ఆస్తి పునరుద్ధరణకు సంబంధించిన పరిహారాన్ని అధికారుల జీతం నుంచి వసూలు చేస్తామని కోర్టు స్పష్టం చేసింది.

దేశవ్యాప్తంగా కొంతకాలంగా 'బుల్డోజర్‌' చర్యలు హాట్‌ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇది రాజకీయాల్లో కీలక అంశంగా మారింది. బుల్డోజర్‌ న్యాయం పేరుతో పలు రాష్ట్రాలు ఈ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నాయి. యూపీలో మొదట మొదలైన ఈ ధోరణి... ఆ తర్వాత ఇతర రాష్ట్రాలకూ పాకింది. దేశవ్యాప్తంగా ఇటీవల కాలంలో వివిధ రాష్ట్రాల నిందితుల ఇళ్లు, ప్రైవేట్‌ ఆస్తులపైకి బుల్డోజర్‌ను పంపించడాన్ని ఇప్పటికే సుప్రీంకోర్టు పలుమార్లు తప్పుబట్టింది. నిందితుల ఆస్తులపైకి బుల్జోజర్లను పంపడం సరికాదని స్పష్టం చేస్తూ.. అక్రమంగా ఒక్క కట్టడాన్ని ధ్వంసం చేసినా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడినట్లేనని హెచ్చరించింది.

అయితే రోడ్లు, ఫుట్‌పాత్‌ల మీద, రైలు మార్గాలు, జలాశయాలు, ప్రభుత్వ స్థలాల పరిధిలో నిర్మించిన అక్రమ కట్టడాలకు తమ ఆదేశాలు వర్తించవంటూ మినహాయింపునిచ్చింది. కాగా ఈ విషయంపై సుప్రీంకోర్టు మాజీ సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ గతంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ చర్యల ద్వారా పౌరుల గొంతు నొక్కడం సరైనది కాదని.. చట్టబద్ధమైన పాలన జరుగుతున్న సమాజంలో బుల్డోజర్‌ న్యాయం ఆమోదయోద్యం కాదని పేర్కొన్నారు. ప్రజల ఇండ్ల రక్షణ, భద్రత వారి ప్రాథమిక హక్కుల కిందికి వస్తాయని, వాటిని కూల్చివేసే అధికారం ప్రభుత్వాలకు ఉండదని ఆయన పేర్కొన్నారు. దీనికి అనుమతిచ్చిన అధికారులపైనా చర్యలు తీసుకోవాలన్నారు.

First Published:  13 Nov 2024 11:25 AM IST
Next Story