బిహార్‌లో కూలిన మరో వంతెన.. నిర్మాణంలో ఉండగానే కూలిన వైనం
బిహార్ ప్రభుత్వం రూ.1,717 కోట్లు కేటాయించింది. ఖగారియా – అగువాని ప్రాంతాల మధ్య గంగా నదిపై ఈ వంతెన నిర్మాణానికి 2015లో సీఎం నితీశ్‌కుమార్ శంకుస్థాపన చేశారు.
బిహార్‌లో మరో వంతెన కూలింది. నిర్మాణంలో ఉండగానే వంతెనలోని కొంత భాగం కూలిపోయింది. ఈ వంతెన కూలిపోవడం ఇది మూడోసారి కావడం గమనార్హం. ఇప్పటికే బిహార్‌లోని పలు ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న వంతెనలు కూలిపోయిన ఘటనలు తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. తాజా ఘటనతో నితీశ్ కుమార్ సర్కార్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తాజా ఘటన బిహార్‌లోని ఖగారియా జిల్లాలో జరిగింది. గంగా నదిపై అగువాని సులాన్‌గంజ్ గంగా పేరుతో నిర్మిస్తున్న బ్రిడ్జ్ ఓ భాగం ఒక్కసారిగా గంగానదిలో కూలిపోయింది. ఇది ఇంకా నిర్మాణంలో ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని వారు వెల్లడించారు. వంతెన కూలుతున్న సమయంలో అక్కడే ఉన్న స్థానికులు ఆ దృశ్యాలను రికార్డు చేశారు. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. గతేడాది ఏప్రిల్‌లో తుపాను కారణంగా వంతెన పిల్లర్లు కొంతభాగం కుప్పకూలిపోగా తిరిగి నిర్మాణం చేపట్టారు.
దీని నిర్మాణం కోసం బిహార్ ప్రభుత్వం రూ.1,717 కోట్లు కేటాయించింది. ఖగారియా – అగువాని ప్రాంతాల మధ్య గంగా నదిపై ఈ వంతెన నిర్మాణానికి 2015లో సీఎం నితీశ్‌కుమార్ శంకుస్థాపన చేశారు. ఈ వంతెన నిర్మాణం 2020 నాటికి పూర్తికావాల్సి ఉండగా ఇప్పటికీ పూర్తికాలేదు. ఒకే వంతెన నిర్మాణం పూర్తికాకముందే మూడుసార్లు కూలడంతో నిర్మాణంలో నాణ్యత, ప్రాజెక్టు అమరికపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్షాలు నితీశ్‌కుమార్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. ఈ ఘటనపై స్పందించిన ప్రభుత్వం నిర్మాణం చేపడుతున్న ఎస్‌కే సింగ్లా కన్‌స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు జరిమానా విధించింది. వంతెనను సొంత ఖర్చుతో పునర్ నిర్మించాలని ఆదేశించింది.