తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉదయనిధి
ముఖ్యమంత్రి స్టాలిన్ తన తనయుడు ఉదయనిధిని ఏకంగా డిప్యూటీ సీఎంను చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.
తమిళనాడు యువజన సంక్షేమం, క్రీడా శాఖ మంత్రి, డీఎంకే యువజన విభాగం అధ్యక్షుడు ఉదయనిధి స్టాలిన్ త్వరలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలుస్తోంది. తన తండ్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఉదయనిధి వెల్లడించారు. తాజాగా చెన్నైలో డీఎంకే యువజన విభాగం 45వ వ్యవస్థాపక దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉదయనిధి పాల్గొనగా.. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నట్లు జరుగుతున్న ప్రచారంపై మీడియా ప్రతినిధులు ఆయన్ను ప్రశ్నించారు.
దీనిపై ఉదయనిధి స్పందిస్తూ.. దీనిపై త్వరలోనే స్పష్టత వస్తుందని చెప్పారు. డిప్యూటీ సీఎం పదవిపై ముఖ్యమంత్రి స్టాలిన్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని వెల్లడించారు. తమ ప్రభుత్వంలో అందరూ మంత్రులు డిప్యూటీ సీఎంలే.. అని ఉదయనిధి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తమ దృష్టంతా 2026లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపైనే ఉందన్నారు.
సినీ హీరోగా పలు విజయవంతమైన సినిమాల్లో నటించిన ఉదయనిధి స్టాలిన్ 2021 అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయ రంగ ప్రవేశం చేశారు. అంతకుముందు తన తండ్రి స్టాలిన్ నిర్వహించిన పార్టీ యువజన విభాగం అధ్యక్ష బాధ్యతను స్వీకరించి రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం నిర్వహించారు. ఆ ఎన్నికల్లో డీఎంకే ఘన విజయం సాధించింది. ఉదయనిధి చెపాక్ -తిరువల్లికేని నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
కాగా, డీఎంకే ప్రభుత్వం ఏర్పడిన ఏడాది తర్వాత.. ముఖ్యమంత్రి స్టాలిన్ తన తనయుడు ఉదయనిధిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. దీనిపై అప్పట్లో ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. డీఎంకే కుటుంబ రాజకీయాలు చేస్తోందని విమర్శించాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి స్టాలిన్ తన తనయుడు ఉదయనిధిని ఏకంగా డిప్యూటీ సీఎంను చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. రాష్ట్రంలో 2026లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఉదయనిధిని డిప్యూటీ సీఎం చేసి ఎన్నికలకు వెళ్లాలని స్టాలిన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.