Telugu Global
National

ఆ కాల్స్‌ను తక్షణం నిలిపివేయాలి.. టెలికాం కంపెనీలకు ట్రాయ్‌ కీలక ఆదేశాలు

నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా ఈ తరహా కాల్స్‌ చేస్తే రెండేళ్ల పాటు యాక్సెస్‌ను నిలిపివేస్తామని ట్రాయ్‌ హెచ్చరించింది. ఆ సంస్థను రెండేళ్ల వరకు బ్లాక్‌ లిస్ట్‌లో పెడతామని తేల్చిచెప్పింది.

ఆ కాల్స్‌ను తక్షణం నిలిపివేయాలి.. టెలికాం కంపెనీలకు ట్రాయ్‌ కీలక ఆదేశాలు
X

స్పామ్‌ కాల్స్‌ను తక్షణం నిలిపివేయాలని టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ ఆదేశించింది. అన్‌ రిజిస్టర్డ్‌ టెలీ మార్కెటర్ల నుంచి ప్రమోషనల్‌ కాల్స్, ప్రీ రికార్డెడ్‌ లేదా కంప్యూటర్‌ జనరేటెడ్‌ కాల్స్‌ను తక్షణమే నిలిపివేయాలని టెలికాం కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. స్పామ్‌ కాల్స్‌పై వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ ఆదేశాలిచ్చింది. అన్‌ రిజిస్టర్డ్‌ టెలీ మార్కెటర్ల నుంచి వస్తున్న కాల్స్‌పై ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసికంలో ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో ఆయా అన్‌ రిజిస్టర్డ్‌ టెలీ మార్కెటర్ల డేటాను సమర్పించాలంటూ టెల్కోలకు ట్రాయ్‌ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. తాజాగా మంగళవారం నాడు ఆ తరహా కాల్స్‌ను తక్షణం నిలిపివేయాలని స్పష్టం చేసింది.

నిబంధనలు ఉల్లంఘిస్తే.. రెండేళ్లపాటు యాక్సెస్‌ నిలిపివేత..

ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా ఈ తరహా కాల్స్‌ చేస్తే రెండేళ్ల పాటు యాక్సెస్‌ను నిలిపివేస్తామని ట్రాయ్‌ హెచ్చరించింది. ఆ సంస్థను రెండేళ్ల వరకు బ్లాక్‌ లిస్ట్‌లో పెడతామని తేల్చిచెప్పింది. ప్రస్తుతం ఇచ్చిన ఆదేశాలపై ఏమేం చర్యలు తీసుకున్నారో వెల్లడించాలంటూ టెల్కోలను ట్రాయ్‌ ఆదేశించింది. ఎప్పటిలానే ప్రతినెలా ఒకటో తేదీ, 16వ తేదీన సంబంధిత డేటాను సమర్పించాలని తెలిపింది. ఎయిర్‌టెల్, జియో, బీఎస్‌ఎన్‌ఎల్, వొడాఫోన్, ఐడియా, టాటా టెలీ సర్వీసెస్‌ వంటి మొబైల్‌ కంపెనీల చీఫ్‌ రెగ్యులేటరీ ఆఫీసర్లతో ట్రాయ్‌ చీఫ్‌ ఈ అంశంపై గత వారంలో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలోనే తాజా ఆదేశాలు వెలువడ్డాయి.

First Published:  14 Aug 2024 8:06 AM IST
Next Story