ఢిల్లీ సీఎంగా నేడు ఆతిశీ ప్రమాణం
ఇవాళ సాయంత్రం 4.30 గంటలకు ఢిల్లీలోని రాజ్ నివాస్‌లో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆతిశీతోపాటు మరో ఐదుగురిని మంత్రులుగా ప్రమాణం చేయించనున్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీ నేత ఆతిశీ మార్లేనా సింగ్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా సాయంత్రం ప్రమాణం చేయనున్నారు. ఆతిశీ మంత్రి మండలిలోని ఐదుగురు సభ్యులు ఢిల్లీలోని రాజ్ నివాస్‌లో ప్రమాణం చేయనున్నారు. కేజ్రీవాల్ రాజీనామాకు, కొత్త ప్రభుత్వ ఏర్పాటునకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారని లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం తెలిపింది.
ఢిల్లీ సీఎం పదవికి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అదేరోజు సాయంత్రం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాను కలిసి రాజీనామా లేఖను అందజేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ శాసనసభ పక్ష నేతగా ఆతిశీని ఎన్నుకున్నట్లు తెలిపారు. కేజ్రీవాల్ రాజీనామా, కొత్త ప్రభుత్వ ఏర్పాటునకు సంబంధించిన దస్త్రాలను ఎల్జీ రాష్ట్రపతికి పంపగా ఆమె ఆమోదించారు. నేడు ప్రమాణ స్వీకారం తేదీని ప్రతిపాదించారు. ఈ మేరకు ఆతిశీ ప్రమాణ స్వీకారానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.