Telugu Global
National

ప్రధాని తలవంచి నమస్కరించడంతో ప్రయోజనం లేదు

కొల్హాపూర్‌లో ఛత్రపతి శివాజీ మహారాజ్‌ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో మోడీపై రాహుల్‌ ధ్వజం

ప్రధాని తలవంచి నమస్కరించడంతో ప్రయోజనం లేదు
X

బీజేపీ నేతృత్వంలోని ప్రజలను భయపెట్టడంతో పాటు రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తున్నదని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ తీవ్రమైన ఆరోపణలు చేశారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో ఛత్రపతి శివాజీ మహారాజ్‌ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ ప్రధాని మోడీపై మండిపడ్డారు.

ఈ ఏడాది ఆగస్టులో సింధుదుర్గ్‌ జిల్లాలోని రాజ్‌కోట్‌ కోటలో 35 అడుగుల శివాజీ విగ్రహం కుప్పకూలింది. ఈ ఘటనను ఉద్దేశిస్తూ బీజేపీ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలను భయపెడుతూ, రాజ్యాంగాన్ని, ఆయా సంస్థలను నాశనం చేస్తూ.. ఇప్పుడు ఛత్రపతి శివాజీ ఎదుట తలవంచి నమస్కరించడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. శివాజీ అందించిన సందేశం దేశమంతటికీ వర్తిస్తుంది. ఛత్రపతి, సాహూ మహరాజ్‌ లాంటి యోధులు లేకపోయి ఉంటే నేడు మనకు రాజ్యాంగం ఉండేది కాదు అని ప్రధాని మోడీని ఉద్దేశిస్తూ రాహుల్‌ వ్యాఖ్యానించారు.

భారీ వర్షాల కారణంగా రాజ్‌కోట్‌ కోటాలో 35 అడుగుల శివాజీ విగ్రహం ప్రధాని ప్రారంభించిన కొన్నిరోజులకే కుప్పకూలింది. నాణ్యత లోపం వల్లనే విగ్రహం కూలిపోయిందని ఈ ఘటనపై విపక్షాలు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన విమర్శలు చేశాయి. ఈ ఘటన చోటు చేసుకున్న తర్వాత రాష్ట్రంలో పర్యటించిన ప్రధాని.. శివాజీకి తల వంచి క్షమాపణలు చెప్పారు. మనకు దైవం కంటే గొప్పదేమీ లేదన్నారు. మరికొన్ని రోజుల్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో శివాజీ విగ్రహం కూలిన అంశంపై అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్‌ల మధ్య మాటల యుద్ధం జరుగుతున్నది.

First Published:  5 Oct 2024 8:55 AM GMT
Next Story