Telugu Global
National

అప్పుడు సుప్రియకు ఓటేశారు.. ఇప్పుడు నాకు వేయండి

బారామతి అభివృద్ధికి నా స్టైల్‌లో కృషి చేస్తానని అజిత్‌ పవార్‌ హామీ

అప్పుడు సుప్రియకు ఓటేశారు.. ఇప్పుడు నాకు వేయండి
X

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తున్నది. దీంతో అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ ఎన్నికలు ఎన్డీఏ, ఇండియా కూటమికి ముఖ్యంగా అసలైన ఎన్సీపీ, శివసేన ఎవరిది అన్నది ఓటర్లు తేల్చబోతున్నారు. దీంతో అధికార మహాయుతి, విపక్ష మహా వికాస్‌ అఘాడీ కూటమిలు తమదైన వ్యూహాలతో ప్రచారం చేస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి యత్నిస్తున్నారు. మరోవైపు మహారాష్ట్రలో ఒక స్థానంలో ఎవరు గెలుస్తారనే ఆసక్తి కూడా నెలకొన్నది. అదే బారామతి నియోజకవర్గం. పవార్‌ కుటుంబ సభ్యుల మధ్య తీవ్ర పోటీ నెలకొన్నది. ఈ నేపథ్యంలోనే ఎన్సీపీ నేత, డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బారామతి నుంచి సుప్రియా సూలేను గెలిపించి 'సాహెబ్‌' (శరద్‌ పవార్‌)ను సంతోషపెట్టారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం నాకు ఓటు వేయండి. లోక్‌సభ ఎన్నికల్లో సుప్రియా ఓడిపోయి ఉంటే సాహెబ్‌ ఈ వయస్సు (83) లో ఎలా బాధపడేవారో? దీన్ని దృష్టిలో పెట్టుకుని సుప్రియకు ఓటు వేశారు. కానీ ఇప్పుడు మాత్రం నాకే ఓటు వేసి నన్ను సంతోష పెట్టండి అని విజ్ఞప్తి చేశారు. శరద్‌ పవార్‌ తన మార్గంలో పనిచేస్తారని.. బారామతి అభివృద్ధికి నా స్టైల్‌లో కృషి చేస్తానని అజిత్‌ హామీ ఇచ్చారు.

నవంబర్‌ 20 ఒకే విడుతలో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీపీ కంచుకోటగా పేరున్న బారామతి నుంచి అజిత్‌ పవార్‌ బరిలో దిగగా.. ఆయన సోదరుడైన శ్రీనివాస్‌ కుమారుడు యుగేంద్ర పవార్‌ను శరద్‌ పవార్‌ పార్టీ బరిలోకి దించింది.

నవంబర్‌ 20న జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అజిత్‌ పవార్‌ బారామతి నుంచి పోటీ చేస్తుండగా.. విపక్ష మహా వికాస్‌ అఘాడీ కూటమి నుంచి ఎన్‌సీపీ (ఎస్పీ) తరఫున యుగేంద్ర పవార్‌ బరిలో ఉన్నారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో శరద్‌ పవార్‌ కుమార్తె సుప్రియా సూలే బారామతి లోక్‌సభ సీటు నుంచి పోటీ చేయగా.. ఆమెపై అజిత్‌ పవార్‌ సతీమణి సునేత్ర పవార్‌ పోటీ చేసి ఓటమిపాలైన సంగతి తెలిసిందే.

First Published:  3 Nov 2024 9:27 PM IST
Next Story