బైటపడుతున్న కాంగ్రెస్, కాషాయ పార్టీ బంధం
కాంగ్రెస్, బీజేపీ మధ్య సత్సంబంధాలు ఉన్నాయనే విషయం ప్రజలకు అర్థమౌతున్నదని, ఢిల్లీ ఎన్నికలు బహిర్గతం చేస్తాయన్న కేజ్రీవాల్
తనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం విదితమే. కేజ్రీవాల్ వ్యాఖ్యలపై బీజేపీ సీనియర్ నేత, అమత్ మాలవీయ స్పందిస్తూ దేశం గురించి తర్వాత ఆలోచించండి.. ముందు మీ ఢిల్లీ సీటును కాపాడుకోండి అని పోస్ట్ చేశారు. దీనిపై కేజ్రీవాల్ మాట్లాడుతూ.. తాను రాహుల్‌గాంధీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు బీజేపీ నేతలు ప్రతిస్పందిస్తున్నారని అన్నారు. దీంతో కాంగ్రెస్, బీజేపీ మధ్య సత్సంబంధాలు ఉన్నాయనే విషయం ప్రజలకు అర్థమౌతున్నదని పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు, బీజేపీకి ఉన్న అనుబంధాన్ని ఢిల్లీ ఎన్నికలు బహిర్గతం చేస్తాయన్నారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీలంపూర్‌లో సోమవారం జరిగిన 'జై బాపు.. జై భీం.. జై సంవిధాన్' సభలో పాల్గొన్న రాహుల్ గాంధీ ఆప్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మోడీ అనుసరించే ప్రచార కండూతి వ్యూహం, అబద్ధపు హామీల బాటలో కేజ్రీవాల్ నడుస్తున్నారని అన్నారు. కాలుష్యం, అవినీతి, ధరల పెరుగుదలను వారిద్దరూ పట్టించుకోవడం లేదని విమర్శించారు. దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాల వారు, మైనారిటీలు తమ వాటాలను సాధించుకోవడానికి చేపట్టాల్సిన కులగణనపై మోడీ, కేజ్రీవాల్ మౌనం దాల్చారని విమర్శించారు. ఢిల్లీలో తాము అధికారంలోకి వస్తే కులగణన చేపడుతామని రాహుల్ హామీ ఇచ్చారు.
రాహుల్ చేసిన వ్యాఖ్యలను తిప్పికొడుతూ కేజ్రీవాల్ ఆయనపై ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీని రక్షించుకోవడానికి రాహుల్‌గాంధీ ప్రయత్నిస్తున్నారని, తాను దేశ రక్షణ కోసం కృషి చేస్తున్నానన్నారు. తనపై రాహుల్ చేసిన విమర్శలను పట్టించుకోనని స్పష్టం చేశారు.