బైటపడిన మావోయిస్టుల ఆయుధశాల
భారీగా పేలుడు సామాగ్రి స్వాధీనం
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో గురువారం 203 కోబ్రా బెటాలియన్, సీఆర్పీఎప్ 131 బెటాలియన్ ఆధ్వర్యంలో మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ చేపట్టారు. ఇందులో మెటగూడెం, డ్యూలర్ గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో భారీగా పేలుడు పదార్థాలు, ఆయుధాల తయారీ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. నిఘా వర్గాల సమాచారం మేరకు 203 కోబ్రాకు చెందిన 5 బృందాలు, సీఆర్పీఎఫ్ 131 బెటాలియన్‌కు చెందిన ఏ,డీ కంపెనీలు కలిసి ఈ ఆపరేషన్ నిర్వహించాయి.
మెటగూడెం గ్రామం నుంచి 1.5 కిలోమీటర్ల దూరంలో ఒక గుహను మొదట భద్రతా బలగాలు కనిపెట్టాయి. అందులోని ఆయుధశాలలో ప్యాక్ చేసిన 21 ఐఈడీలు, బహుళ బారెల్ గ్రెనేడ్ లాంచర్ బాంబులు, ఒక జనరేటర్ సెట్, లాత్ మిషిన్ ఉపకరణాలు, భారీ పరిమాణంలో పేలుడు పదార్థాలు, తుపాకీ తయారీ పరికరాలు, వైద్య సామాగ్రి ఉన్నాయి. ఇంత పెద్ద మొత్తంలో ఆయుధాలను స్వాధీనం చేసుకోవడం ఈ ప్రాంతంలో మావోయిస్టు కార్యకలాపాలకు పెద్ద ఎదురుదెబ్బ అని సీనియర్ భద్రతా అధికారి ఒకరు చెప్పారు. 203 కోబ్రా నుంచి ప్రత్యేక డాగ్ స్క్వాడ్‌లు, బాంబు గుర్తింపు బృందాలు వీటిని గుర్తించడంలో కీలక పాత్ర పోషించాయని ఆయన తెలిపారు.