ప్రధాని మోదీతో తెలంగాణ బీజేపీ నేతల భేటీ
కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా ప్రజల్లోకి వెళ్లాలని సూచించిన మోదీ
ప్రధాని నరేంద్రమోదీతో తెలంగాణ బీజేపీ నాయకులు భేటీ అయ్యారు. బుధవారం సాయంత్రం సీఎంతో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు సమావేశమయ్యారు. కామారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వెంకటరమణారెడ్డిని ఈ సందర్భంగా ప్రధాని ప్రత్యేకంగా అభినందించారు. తెలంగాణ బీజేపీ గ్రాఫ్ వేగంగా పెరుగుతోందని ప్రధాని అన్నారు. ఏడాది క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పై ప్రజలు ఇప్పటికే విసిగిపోయారని, బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనను చూసిన ప్రజల్లో ఆ జ్ఞాపకాలు పదిలంగానే ఉన్నాయని తెలిపారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలంతా ఆశగా బీజేపీ వైపు చూస్తున్నారని.. వారికి భరోసానిచ్చేలా ఎంపీలు, ఎమ్మెల్యేలు గట్టిగా పని చేయాలన్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రజావ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. బీఆర్‌ఎస్ గత పరిపానలలో చేసిన తప్పిదాలను ఎత్తి చూపించాలన్నారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను, ప్రజల కోసం చేస్తున్న మంచి పనులను కార్యకర్తల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. 2028 అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటి నుంచి ప్రజల్లోకి వెళ్లి పని చేయాలన్నారు. తెలంగాణలో బీజేపీకి మంచి భవిష్యత్ ఉంటుందని, ప్రతి ఒక్కరూ పార్టీ కోసం పని చేసేలా క్యాడర్ ను ఉత్సాహ పరచాలని సూచించారు.