రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై పోరాడుదాం రండి
రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా జరిగే వాటిని తమిళనాడు ప్రతిఘటిస్తుంది. విజయం సాధిస్తుందన్న స్టాలిన్

నియోజకవర్గాల విభజన, త్రిభాషా విధానంపై కేంద్రంలోని బీజేపీ, తమిళనాడులోని అధికార డీఎంకేల మధ్య మాటల యుద్ధం సాగుతున్నది. ఈ క్రమంలో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కోవడానికి ప్రతి పౌరుడు కదిలి రావాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన శుక్రవారం 'ఎక్స్' వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు.
'త్రి భాషా, నియోజకవర్గాల పునర్విభజన వంటి రెండు క్లిష్టమైన సవాళ్లను ప్రస్తుతం తమిళనాడు ఎదుర్కొంటున్నది. వీటికి వ్యతిరేకంగా పోరాడటానికి రాష్ట్రంలోని ప్రతి పౌరుడు ముందుకు రావాలి. మన నిజమైన పోరాటాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని మిమ్మల్నిఅభ్యర్థిస్తున్నాను. నియోజకవర్గాల విభజన మన రాష్ట్ర ఆత్మగౌరవాన్ని ప్రభావితం చేస్తున్నది. కర్ణాటక, పంజాబ్‌తో పాటు తెలంగాణ వంటి రాష్ట్రాలు కూడా దీనికి సంఘీభావం తెలిపాయి. కేంద్రం తను ఇష్టానుసారం తీసుకుంటున్న నిర్ణయాలను ఈ రాష్ట్రాలు ప్రతిఘటిస్తున్నాయి. త్రిభాష విధానాన్ని వ్యతిరేకించినందుకు మనకు రావాల్సిన నిధులు నిలిపివేశారు. తమిళనాడులో పార్లమెంటు నియోజకవర్గాలను తగ్గించబోమని చెబుతూనే.. ఇతర రాష్ట్రాల్లో పెంచమని హామీ ఇవ్వలేకపోతున్నారు. మా డిమాండు స్పష్టంగా ఉన్నది. జనాభా ప్రాతిపదికన మాత్రమే నియోజకవర్గాలు నిర్ణయించవద్దు. రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా జరిగే వాటిని తమిళనాడు ప్రతిఘటిస్తుంది. విజయం సాధిస్తుందని' అని స్టాలిన్ పేర్కొన్నారు.