పవన్ కల్యాణ్ బాటలో విజయ్ విజయం సాధిస్తారా..?
ఈరోజు చెన్నైలో జరిగిన కార్యక్రమంలో TVK పార్టీ జెండాని, పార్టీ గీతాన్ని హీరో విజయ్ ఆవిష్కరించారు.
రాజకీయాల్లో సినీ తారల సక్సెస్ రేటు తక్కువేనని చెప్పాలి. సినిమాల్లో గొప్పగా రాణించినవారు కూడా రాజకీయాల్లో మిడిల్ డ్రాప్ అయిన సందర్భాలున్నాయి. తాజాగా పవన్ కల్యాణ్ ఆ అంచనాలను తలకిందులు చేశారు. పార్టీ పెట్టి పదేళ్లుగా విజయం కోసం ఎదురు చూసిన పవన్, కూటమి కుదురుకోవడంతో ఏకండా డిప్యూటీ సీఎం అయ్యారు. అదే బాటలో ఇప్పుడు తమిళ హీరో విజయ్ కూడా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో పార్టీ పేరు ప్రకటించిన విజయ్ ఇప్పుడు జెండా, అజెండా బయటపెట్టారు. పార్టీ గీతాన్ని ఆవిష్కరించారు. 2026లో జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ కీలకంగా మారే అవకాశముంది.
విజయ్ పార్టీ పేరు 'తమిళగ వెట్రి కజగం' (TVK). ఈరోజు చెన్నైలో జరిగిన పార్టీ కార్యక్రమంలో పార్టీ జెండాని ఆయన ఆవిష్కరించారు. జెండా పైన, కింద ముదురు ఎరుపు రంగు, మధ్యలో పసుపు పచ్చ రంగు ఉంటాయి. పసుపు రంగులో రెండు ఏనుగులు ఘీంకరిస్తున్నట్టు నిలబడతాయి. వాటి మధ్యలో ఒక పువ్వు వికసించినట్టు, దాని చుట్టూ నక్షత్రాలతో జెండా రూపొందించారు. విజయ్ పార్టీ జెండా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తమిళనాడులో అధికార డీఎంకేని ఎదుర్కోవడం అన్నాడీఎంకేకి సాధ్యపడేలా లేదు. అందుకే అక్కడ అవకాశం కోసం కాంగ్రెస్, బీజేపీ ఎదురు చూస్తున్నాయి. కూటములు కట్టి తమ ఉనికి మరింత విస్తరించేలా ప్లాన్లు వేస్తున్నాయి. ఈ దశలో విజయ్ TVK పార్టీ సంచలనంగా మారింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు. రజినీకాంత్, కమల్ హాసన్ కి సాధ్యం కానిది విజయ్ చేసి చూపిస్తారా..? ఏపీలో పవన్ కల్యాణ్ లాగా తమిళ రాజకీయాల్లో హీరో విజయ్ తనదైన ముద్ర వేస్తారా..? వేచి చూడాలి.