ఢిల్లీ అసెంబ్లీ సమావేశాల్లో రెండోరోజు ఉద్రిక్తత
ప్రతిపక్ష నేత ఆతిశీ సహా 12 మంది విపక్ష ఎమ్మెల్యేల సస్పెన్షన్

దేశ రాజధాని ఢిల్లీలో వరుసగా రెండో రోజు అసెంబ్లీ సమావేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. సీఎం కార్యాలయం నుంచి బీఆర్ అంబేద్కర్, భగత్ సింగ్‌ల ఫొటోలు తొలిగించారంటూ ప్రతిపక్ష ఆప్ నేతలు ఆందోళకు దిగారు. ఈ ఉదయం సభ ప్రారంభం కాగానే లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రసంగించారు. ఆయన మాట్లాడుతుండగా... ఆప్ నేతలు నిరసనలు చేపట్టారు. దీంతో స్పీకర్ విజేందర్ గుప్తా వారిని సభ నుంచి సస్పెండ్ చేశారు. మాజీ సీఎం, ప్రతిపక్ష నేత ఆతిశీ సహా 12 మంది విపక్ష ఎమ్మెల్యేలను ఒకరోజు పాటు అసెంబ్లీకి రాకుండా సస్పెండ్ చేస్తున్నట్లు సభాపతి వెల్లడించారు.మద్యం కుంభకోణంపై కాగ్ ఇచ్చిన నివేదికను నేడు బీజేపీ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నది. దీనిని నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే ఆ పార్టీ నిరసనలకు పాల్పడుతున్నదని అధికారపార్టీ ఆరోపించింది. సీఎం కార్యాలయంలో మహాత్మాగాంధీ, అంబేద్కర్, భగత్‌సింగ్, రాష్ట్రపతి, ప్రధానమంత్రుల ఫొటోలు ఉన్నాయంటూ పేర్కొంటూ ఇప్పటికే ఓ ఫొటోను విడుదల చేసింది.
ఢిల్లీ ప్రభుత్వానికి రూ. 2000 కోట్ల మేర నష్టం: కాగ్
దేశ రాజధాని ఢిల్లీలో గత ఆప్ ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం విధానంపై కాగ్ రూపొందించిన నివేదిక అంశం ఎన్నికల ముందు పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ నివేదికను తాజాగా బీజేపీ సర్కార్ అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఇందులోని అంశాలను బైటపెట్టింది. 2021-22లో తీసుకొచ్చిన మద్యం విధానం కారణంగా ఢిల్లీ ప్రభుత్వానికి రూ. 2000 కోట్ల మేర నష్టం వాటిలినట్టలు కాగ్ తేల్చింది.