సుప్రీం కోర్టు మొట్టికాయలు వేసినా రేవంత్ తీరు మారుతలేదు
తనపై చేసిన వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్న : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

సుప్రీం కోర్టు మొట్టికాయలు వేసినా రేవంత్ రెడ్డి తీరు మారడం లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సుప్రీం కోర్టు తిట్టిన దేశంలోనే మొట్టమొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావడం తెలంగాణ ఖర్మ అన్నారు. శనివారం నిజామాబాద్ పసుపు యార్డును ఆమె సందర్శించి రైతులతో మాట్లాడారు. మార్కెట్‌లో రైతులు పడుతున్న ఇబ్బందులను ఆరా తీశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, నోరుందికదా అని సీఎం రేవంత్ రెడ్డి గంప గయ్యాళిలా ఒర్రుతున్నారని అన్నారు. తన గురించి మాట్లాడొద్దని సుప్రీం కోర్టు చివాట్లు పెట్టినా రేవంత్ మళ్లీ మాట్లాడారని.. ఆయన విజ్ఞత లేకుండా మాట్లాడిన మాటలను ప్రజలు చూస్తున్నారని అన్నారు. తాను ఆయనలా మాట్లాడి తన స్థాయిని తగ్గించదలుచుకోవడం లేదన్నారు. నోరుందికదా అని ఎటుపడితే అటు మాట్లాడితే కుదరదన్నారు.
రేవంత్ కు బ్రీఫ్ చేసిన తర్వాతే బనకచర్లపై చంద్రబాబు ప్రకటన
ప్రజా భవన్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సీఎంలు సమావేశమైన తర్వాతనే బనకచర్ల ప్రాజెక్టు చేపడుతామని చంద్రబాబు ప్రకటించారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. రేవంత్ రెడ్డికి ప్రాజెక్టు గురించి చంద్రబాబు బ్రీఫ్ చేసిన తర్వాతనే ప్రకటన చేశారన్నారు. గోదావరి నది నుంచి 200 టీఎంసీలను కృష్ణా, పెన్నా బేసిన్‌లకు తరలించడానికి ఏపీ ఈ ప్రాజెక్టు చేపడుతోందన్నారు. 200 టీఎంసీల నీటిని ఏపీ ఎత్తుకపోతుంటే మూర్ఖపు ముఖ్యమంత్రి చూస్తూ నిలబడ్డారని మండిపడ్డారు. బ్యాగుతో దొరికిన రేవంత్ రెడ్డి జుట్టు చంద్రబాబు చేతిలో ఉందని.. కాబట్టే కేంద్రం, చంద్రబాబు ఎలా చెబితే సీఎం రేవంత్ రెడ్డి అలా నడుచుకుంటున్నారని అన్నారు. నిజంగా రేవంత్ రెడ్డి తెలంగాణహితం కోరితే చంద్రబాబు ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ కేంద్రానికి ఎందుకు లేఖ రాయడం లేదు.. ప్రభుత్వం కోర్టుల్లో ఎందుకు కేసులు వేయడం లేదో చెప్పాలన్నారు. ఆనాడు ఏపీ ప్రాజెక్టులు చేపడితే, కాలువలు విస్తరిస్తే కేసీఆర్ వ్యతిరేకిస్తూ కేంద్రానికి లేఖలు రాశారని, ఫిర్యాదులు చేశారని గుర్తు చేశారు. తెలంగాణ రైతుల కంటే రేవంత్ రెడ్డికి ఎక్కువ ప్రేమ చంద్రబాబుపైనే ఉందా.. చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లించు కుంటున్నారా అని ప్రశ్నించారు. రైతుల ఉసురు తీసి గోదావరి, కృష్ణా జలాలు కానుకగా ఇచ్చి చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లించుకుంటున్నారా అని నిలదీశారు. తక్షణమే ఏపీ అక్రమ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని, అవసరమైతే కోర్టుకు వెళ్లి బనకచర్ల ప్రాజెక్టును ఆపాలని డిమాండ్ చేశారు.
పసుపు బోర్డుకు చట్టబద్దత ఏది ?
కేంద్రం పేరుకే పసుపు బోర్డు ఏర్పాటు చేసిందని.. దీనికి చట్టబద్ధత ఏది అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. బోర్డుకు చట్టబద్ధత లేకపోవడంతో పసుపు ధరలు పడిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. బోర్డుకు చట్టబద్ధత ఉంటే బయటి దేశాల నుంచి వచ్చే నాసిరకం పసుపు దిగుమతులు తగ్గుతాయని.. స్థానికంగా పసుపుకు మంచి రేటు వస్తుందన్నారు. వ్యాపారులంతా సిండికేట్ గా మారి పసుపు ధర తగ్గిస్తున్నారని, రైతులు నాలుగైదు రోజులు వేచిచూసినా పసుపు కొనడం లేదన్నారు. ఒక రకంగా రైతును బ్లాక్ మెయిల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మంచి నాణ్యతగల పసుపును తెచ్చిన మంచి ధర ఇవ్వడం లేదని రైతులు చెప్తున్నారని వివరించారు. క్వింటాల్ పసుపునకు రూ.12 వేల కనీస ధర కల్పిస్తామని.. అంతకన్నా ధర తక్కువైతే మిగిలిన మొత్తాన్ని బోనస్ రూపంలో ఇస్తామని రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని గుర్తు చేశారు. వెంటనే పసుపునకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. పసుపు రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని.. మార్చి ఒకటో తేదీలోపు బోనస్ ప్రకటించకపోతే కలెక్టరేట్ ను దిగ్బంధిస్తామని హెచ్చరించారు.
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదంపై ఎన్‌డీఎస్‌ఏ స్పందించాలే
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పై కప్పు కూలి కూలీలు గాయపడటం అత్యంత దురదృష్టకరమని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. టన్నెల్ ప్రమాదంపై 'ఎక్స్' వేదికగా ఆమె రియాక్ట్ అయ్యారు. ''కేసీఆర్ హయాంలో పది కి.మీ.ల మేర టన్నెల్ తవ్వారు. ఏ ఒక్క రోజూ ఇలాంటి ప్రమాదం జరగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు రోజుల కిందనే పనులు మొదలు పెట్టింది. అంతలోనే ఈ పెను ప్రమాదం ఎలా జరిగింది? దీనికి ఎవరు బాధ్యులు? నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) ఈ ప్రమాదంపై స్పందించాలి. ఇంకా 9 కి.మీ.లకు పైగా టన్నెల్ తవ్వాల్సి ఉంది. భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కీలకమైన ప్రాజెక్టుల విషయంలో తొందరపాటుతో వ్యవహరిస్తే ఏం జరుగుతుందో ఈ ప్రమాదం కాంగ్రెస్ పాలకులకు గట్టి హెచ్చరికనే ఇస్తోంది. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలి..'' అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.