Telugu Global
National

బిల్కిస్‌ బానో కేసులో బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేత

దోషులు రాధేశైమ్‌ భగవాన్‌ దాస్‌ షా, రాజుభాయ్‌ బాబూలాల్‌ సోనీ.. తమ పిటిషన్‌ను ఉపసంహరించుకోవడానికి అనుమతి కోరగా దానికి బెంచ్‌ అనుమతించింది.

బిల్కిస్‌ బానో కేసులో బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేత
X

బిల్కిస్‌ బానో కేసులో శిక్ష అనుభవిస్తున్న ఇద్దరు దోషులు తమకు రెమిషన్‌ (శిక్ష తగ్గింపు) ఆదేశాలు వచ్చేవరకు బెయిల్‌ మంజూరు చేయాల్సిందిగా సుప్రీంకోర్టును ఆశ్ర‌యించ‌గా, వారి పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది. శుక్రవారం దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు వారి అభ్యర్థనను తోసిపుచ్చింది. ఇది పూర్తిగా తప్పుడు పిటిషన్‌ అని న్యాయమూర్తులు సంజీవ్‌ ఖన్నా, సంజయ్‌ కుమార్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. కోర్టులోని ఒక బెంచ్‌ జారీ చేసిన ఆర్డర్‌పై మరొక బెంచ్‌కి ఎలా అప్పీల్‌ చేస్తారని ఈ సందర్భంగా ధర్మాసనం ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో దోషులు రాధేశైమ్‌ భగవాన్‌ దాస్‌ షా, రాజుభాయ్‌ బాబూలాల్‌ సోనీ.. తమ పిటిషన్‌ను ఉపసంహరించుకోవడానికి అనుమతి కోరగా దానికి బెంచ్‌ అనుమతించింది. దాస్ షా మధ్యంతర బెయిల్‌ కోసం కూడా దరఖాస్తు చేసుకోవడం గమనార్హం.

2002లో గోద్రా రైలు దహనకాండ అనంతరం గుజరాత్‌లో మతపరమైన అల్లర్లు పెద్ద ఎత్తున జరిగిన విషయం తెలిసిందే. ఆ అల్లర్లలో బిల్కిస్‌ బానో కుటుంబానికి చెందిన ఏడుగురు సభ్యులు హత్యకు గురయ్యారు. 5 నెలల గర్భిణిగా ఉన్న బానోపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో 11 మంది దోషుల‌కు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం 2008లో యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.

14 ఏళ్లుగా దోషులు శిక్ష అనుభవిస్తున్నారు. అయితే వీరికి 2022లో గుజరాత్‌ ప్రభుత్వం రెమిషన్‌ (శిక్ష తగ్గింపు) మంజూరు చేసింది. దీంతో 2022 ఆగస్టు 15న వారంతా జైలు నుంచి విడుదలయ్యారు. దీంతో గుజరాత్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ బానో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన అత్యున్నత ధర్మాసనం గుజరాత్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టింది. వారి విడుదల చెల్లదని జనవరి 8న కీలక తీర్పు వెలువరించింది. దోషులు రెండు వారాల్లోగా జైలు అధికారుల వద్ద లొంగిపోవాలని ఆదేశించింది.

First Published:  20 July 2024 6:01 AM GMT
Next Story