గ్రూప్ -1 నోటిఫికేషన్ రద్దు కుదరదు
తేల్చిచెప్పిన సుప్రీం కోర్టు
తెలంగాణ ప్రభుత్వం గ్రూప్ -1 పోస్టుల భర్తీ కోసం ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేయడం కుదరదని సుప్రీం కోర్టు తేల్చిచెప్పింది. గ్రూప్ -1 మెయిన్స్‌కు అర్హుల ఎంపికలో అన్యాయం జరిగిందని.. మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయడంతో పాటు ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేయాలని నిరుద్యోగులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ప్రిలిమ్స్ పరీక్షలో 14 ప్రశ్నలు తప్పుగా వచ్చాయని పిటిషనర్లు వాదించారు. గ్రూప్ -1 పరీక్ష రోజే ఈ పిటిషన్ విచారణకు రావడంతో చివరి నిమిషంలో తాము జోక్యం చేసుకోబోమని సుప్రీం కోర్టు అప్పుడే తేల్చిచెప్పింది. పరీక్షలను వాయిదా వేయాలని తాము ఆదేశించబోమని కూడా స్పష్టం చేసింది. గ్రూప్-1కు సంబంధించిన పిటిషన్లు తెలంగాణ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయని.. ప్రభుత్వం ఇచ్చిన జీవో 29పై తెలంగాణ హైకోర్టు అప్పటికే విచారణ జరుపుతోందని సుప్రీం కోర్టు గుర్తు చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకే గ్రూప్ -1 పోస్టులకు ఉద్యోగుల ఎంపిక ఉంటుందని పేర్కొన్నది. ఆ పిటిషన్లను శుక్రవారం విచారించిన సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ నరసింహ నేతృత్వంలోని బెంచ్ తీర్పు వెలువరించింది. పిటిషన్ దాఖలు చేసిన వాళ్లెవరూ మెయిన్స్ కు క్వాలిఫై కాలేదని.. ఈ నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేయాల్సిన అవసరం లేదని తీర్పులో పేర్కొన్నారు.