తెలంగాణ హైకోర్టు సీజే బదిలీకి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు
ఆలోక్ అరాధేను బాంబే హైకోర్టుకు, బాంబే హైకోర్టు సీజే జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ్‌ను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేయాలని కొలీజియం సిఫార్సు

తెలంగాణ, బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను బదిలీ చేయడానికి సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫార్సు చేసింది. తెలంగాణ హైకోర్టు సీజేగా ఉన్న ఆలోక్ అరాధేను బాంబే హైకోర్టుకు, బాంబే హైకోర్టు సీజే జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ్‌ను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేయాలని కొలీజియం సిఫార్సు చేసింది. 2023 జులైలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఆలోక్ అరాధే నియమితులైన విషయం విదితమే.
అలాగే పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె. వినోద్ చంద్రన్‌ను సుప్రీంకోర్టు జడ్జి నియమించేందుకు సుప్రీంకోర్టు సీజే జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ఐదుగురు జడ్జిలతో కూడిన కొలీజియం సిఫార్సు చేసింది. 2011 నవంబర్ కేరళ హైకోర్టు జడ్జిగా నియమితులైన జస్టిస్ చంద్రన్.. ఆ తర్వాత పాట్నా హైకోర్టు సీజేగా పదోన్నతి పొందారు. 2023 మార్చి 29 నుంచి అదే హోదాలో కొనసాగుతున్నారు. కొలీజియం సిఫార్సును కేంద్రం ఆమోదిస్తే.. సుప్రీంకోర్టులో మొత్తం జడ్జిల సంఖ్య 33కు చేరుకోనుంది.