శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం.. 9న టోకెన్లు
టోకెన్లు లేని భక్తులకు పది రోజులు దర్శనాలు బంద్
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో స్వామివారిని వైకుంఠ ద్వారం ద్వారా దర్శనం చేసుకోవాలని ఆశిస్తోన్న భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. జనవరి 10 నుంచి 19 తేదీ వరకు స్వామివారిని ఉచితంగా దర్శనం చేసుకోవడానికి 1.20 లక్షల టోకెట్లు జారీ చేయనున్నట్టు టీటీడీ ఈవో శ్యామలరావు ప్రకటించారు. జనవరి 9వ తేదీన ఉదయం 5 గంటలకు టోకెన్లు జారీ చేయనున్నారు. 10 నుంచి 12వ తేదీ వరకు 9వ తేదీన టోకెట్లు జారీ చేస్తారు 13 నుంచి 19వ తేదీ వరకు టోకెన్లను ఒక రోజు ముందు ఇస్తారు. ఇందుకోసం తిరుపతిలోని ఎనిమిది ప్రాంతాల్లో అదనపు కౌంటర్లను ఏర్పాటు చేశారు. తిరుపతిలోని రామచంద్ర పుష్కరిణి, భూదేవి కాంప్లెక్స్, జీవకోన హైస్కూల్, ఇందిరా మైదానం, శ్రీనివాసం, విష్ణు నివాసం, బైరాగిపట్టెడలోని రామానాయుడు స్కూల్, ఎం.ఆర్. పల్లి స్కూల్ తో పాటు (తిరుమలలో బాలాజీ నగర్ లోని కమ్యూనిటీ హాల్ లో తిరుమల స్థానికుల కొరకు ) కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తిరుపతిలోని 8 కేంద్రాలలో 87 కౌంటర్లు, తిరుమలలో 4 కౌంటర్లు కలుపుకుని మొత్తం 91 కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. భక్తులు ఆధార్ కార్డు చూపించి టోకెన్లు పొందాలని, టోకెన్లు పొందిన భక్తులకు వారి ఫోటో గుర్తింపుతో కూడిన స్లిప్ లను జారీ చేస్తామని తెలిపారు. టోకెన్లు లేని భక్తులకు ఈ 10 రోజులలో శ్రీవారి దర్శనం ఉండదని స్పష్టం చేశారు.