Telugu Global
National

నాపై విద్వేష వ్యాప్తికి రూ. 500 కోట్లు ఖర్చు చేస్తున్న బీజేపీ

ప్రజల మధ్య ద్వేషాన్ని రగిల్చి.. రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చుకోవడంలో ఆ పార్టీ దిట్ట అన్న హేమంత్‌ సోరెన్‌

నాపై విద్వేష వ్యాప్తికి  రూ. 500 కోట్లు ఖర్చు చేస్తున్న బీజేపీ
X

తనపై బూటకపు ప్రచారం కోసం బీజేపీ భారీగా ఖర్చు పెడుతున్నదని ఝార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌ ఆరోపించారు. విద్వేషాన్ని వ్యాప్తి చేయడానికి బీజేపీ రూ. 500 కోట్లు ఖర్చు చేస్తున్నదని ఆరోపణలు గుప్పించారు. ప్రజల మధ్య ద్వేషాన్ని రగిల్చి.. రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చుకోవడంలో ఆ పార్టీ దిట్ట అని విమర్శించారు. రాష్ట్రంలోని సంకీర్ణ ప్రభుత్వం గురించి బూటకపు ప్రచారం చేయడానికి రూ. కోట్లు ఖర్చు చేసి 9 వేలకు పైగా వాట్సప్‌ గ్రూప్‌లను సృష్టించింది. కానీ నేను ఝార్ఖండ్‌కు చెందిన బిడ్డను.ఝార్ఖండ్‌ గడ్డపై ఈ తరహా సంస్కృతికి తావులేదని, అలాంటి పనులు తాను చేయలేనని ఎక్స్‌ లో పోస్టు చేశారు.

బీహార్‌లో, ఛత్తీస్‌ఢ్‌, ఒడిషా, బెంగాల్‌ నుంచి కొందరిని ప్రచారానికి తీసుకొచ్చింది. వారితో నాకు వ్యతిరేకంగా మాట్లాడించింది. ఓటర్లను ఆందోళనకు గురిచేయడానికి యత్నించింది. ఇవన్నీ బీజేపీ జిమ్మిక్కులు. దీనికోసం ఒక్కో నియోజకవర్గంలో రూ. కోటికి పైగా ఖర్చు చేసింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ప్రచారం చేయకుండా అసత్యాలు మాట్లాడారు. ఎన్నికల బాండ్లు, నకిలీ ఔషధాలు, నకిలీ వాక్సిన్లతో మేము ప్రజల జీవితాలతో ఆడుకోలేదు అంటూ బీజేపీపై ఆరోపణలు చేశారు.

ఝార్ఖండ్‌లో ఎన్డీఏ, ఇండియా కూటముల మధ్య ప్రధాన పోరు జరుగుతున్నది. అక్కడ మొదటి విడుత 43 స్థానాలకు పోలింగ్‌ పూర్తికాగా.. రేపు తుది విడతలో 38 స్థానాలకు జరుగుతున్న పోటీలో 528 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వారిలో 472 మంది పురుషులు, 55 మంది మహిళలు, ఒకరు ట్రాన్స్‌ జెండర్‌ ఉన్నారు. 1.23 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్‌ కోసం 14, 218 పోలింగ్‌ బూత్‌లను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది.

First Published:  19 Nov 2024 1:26 PM IST
Next Story