వీలైనంత త్వరగా జనగణన చేపట్టాలి
రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సోనియాగాంధీ
![వీలైనంత త్వరగా జనగణన చేపట్టాలి వీలైనంత త్వరగా జనగణన చేపట్టాలి](https://www.teluguglobal.com/h-upload/2025/02/10/1402075-sonia.webp)
కేంద్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా జనగణన చేపట్టాలని కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాగాంధీ డిమాండ్ చేశారు. 140 కోట్ల మందికి ఆహారభద్రత కల్పించాలనే ఉద్దేశంతో యూపీఏ హయాంలో తాము జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్‌ఎప్‌ఎస్‌ఏ) కోల్పోతున్నారని అన్నారు. 2011 జనాభా లెక్కలనే పరిగణనలోకి తీసుకోవడం వల్ల ఇలా జరుగుతున్నదని తెలిపారు. కాబట్టి బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం త్వరగా జనగణన నిర్వహించాలని కోరారు.
2013 సెప్టెంబర్‌లో తాము రూపొందించిన ఎన్‌ఎప్‌ఎస్‌ఏ చట్టం దేశంలోని 140 కోట్ల జనాభాకు పోషకాహార భద్రత కల్పించడంలో ఓ మైలురాయిగా మారిందన్నారు. ముఖ్యంగా కొవిడ్ సమయంలో ఈ చట్టం లక్షలాది కుటుంబాల కడుపు నింపిందని గుర్తు చేశారు. త్వరగా జనగణన చేపట్టడం వల్ల ఎన్‌ఎప్‌ఎస్‌ఏ కింద ఎందరో పేద ప్రజలు లబ్ధి పొందుతారని అన్నారు. ప్రజలకు ఆహారభద్రత ప్రత్యేక హక్కు కాదని... ప్రాథమిక హక్కు అని పేర్కొన్నారు. రాజ్యసభ సమావేశంలో పాల్గొన్న సోనియాగాంధీ జీరో అవర్‌లో ప్రజల ఆహార భద్రత గురించి ప్రసంగించారు.
స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఎన్డీఏ పాలనలో దేశంలో జనాభా గణన నాలుగేళ్లకు పైగా ఆలస్యమైందని సోనియా విమర్శించారు. వాస్తవానికి 2021లోనే జనగణన నిర్వహించాల్సి ఉండగా కేంద్ర ప్రభుత్వం దానిని విస్మరించిందని అన్నారు. తిరిగి ఎప్పుడు చేపడుతారనే విషయంపై ఇప్పటివరకు స్పష్టత లేదని అసహనం వ్యక్తం చేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం జాతీయ ఆహార భద్రతా చట్టం సుమారు 81.35 కోట్ల మంది ప్రజలు లబ్ధి పొందారని సోనియా తెలిపారు. గ్రామీణ జనాభాలో 75 శాతం పట్టణ జనాభాలో 50 శాతం ప్రజలు దీనిద్వారా ప్రయోజనం పొందారన్నారు. ఈ పథకం ద్వారా ప్రతి వ్యక్తికి నెలకు 5 కిలోల ఆహారధాన్యాలను ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్నది.