శిల్పాశెట్టికి ఆ నేరంతో సంబంధం లేదు
ఆమె భర్త రాజ్‌కుంద్రా ఇంటిపై జరుగుతున్న ఈడీ సోదాలపై స్పందించిన ఆమె లాయర్. మీడియాలో వస్తున్న నిజం కాదని,ఈ నేరంతో శిల్పాశెట్టి సంబంధం లేదని వెల్లడి.
ప్రముఖ వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా ఇళ్లు, ఆఫీసుల్లో ఈడీ సోదాలు జరుగుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని శిల్పాశెట్టి తరఫు లాయర్ వెల్లడించారు. ఆమెకు ఈ నేరంతో సంబంధం లేదని స్పష్టం చేశారు. అశ్లీల సినిమాల నిర్మాణం, ప్రసారం కేసులో ఈడీ సోదాలు జరుగుతున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. కుంద్రాతో పాటు ఆ కేసుతో సంబంధం ఉన్న ఇతర వ్యక్తులకు చెందిన ఆఫీసుల్లోనూ దర్యాప్తు సంస్థలు సోదాలు చేపడుతున్నట్లు మీడియా సంస్థలు పేర్కొన్న విషయం విదితమే. దీనిపై తాజాగా శిల్పాశెట్టి లాయర్ స్పందించారు. ఈడీ సోదాలు జరగలేదన్నారు. రాజ్‌కుంద్రాకు సంబంధించిన కేసు విచారణ కొనసాగుతున్నదని, ఆయన కూడా అధికారులకు సహకరిస్తున్నారని చెప్పారు. ఈడీ సోదాలు జరుగుతున్నట్లు ప్రచారమవుతున్న వార్తల్లో శిల్పాశెట్టి ఫొటోలు, వీడియోలు ఉపయోగించవద్దని కోరారు. ఆమెకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదన్నారు. ఒకవేళ ఆమె ఫొటోలు వినియోగిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మనీలాండరింగ్ కేసులో భాగంగా రాజ్‌కుంద్రాకు చెందిన ఇళ్లు, ఆఫీసుల్లో ముంబై, ఉత్తరప్రదేశ్‌లోని సుమారు 15 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయని నిన్న జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. మొబైల్ అప్లికేషన్ ద్వారా అశ్లీల కంటెంట్ నిర్మాణం , పంపిణీకి సంబంధించిన ఆరోపణలకు సంబంధించిన మనీ-లాండరింగ్ కేసులో ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు ఆ కథనాలు పేర్కొన్నాయి. పోర్న్ ప్రొడక్షన్‌కు సంబంధించి ఆరోపణలపై 2021లో కుంద్రాపై ఈడీ విచారణ చేస్తున్నది. 2021 జూలైలో ఇండియన్ పీనల్ కోడ్ ,ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్‌లోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన ముంబై క్రైమ్ బ్రాంచ్ రాజ్ కుంద్రా అరెస్టు చేసింది. దాంతో కొన్ని నెలల పాటు జైల్లో ఉండాల్సి వచ్చింది. ఈ కేసులో కుంద్రా ప్రధాన నిందితుడని పోలీసు అధికారులు వెల్లడించారు. అప్పట్లో దాఖలైన ఛార్జ్‌షీట్‌లో.. సినిమా అవకాశాల కోసం ముంబయికి వచ్చే యువతులను వంచించి ఆయన పెద్దఎత్తున ఆర్జించినట్లు పేర్కొన్నారు.ఆ తర్వాత ఆయన బెయిల్ పై విడుదలయ్యారు.
ఇదిలా ఉంటే 2017లో జరిగిన 'గెయిన్ బిట్‌కాయిన్ పోంజీ స్కీమ్' పేరిట అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేసిన కేసులోనూ రాజ్‌కుంద్రా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. బిట్‌కాయిన్లతో మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో గతంలో కుంద్రా, ఆయన భార్య శిల్పాశెట్టిపై ఈడీ చర్యలు చేపట్టింది. వారికి చెందిన రూ. 97.79 కోట్ల స్థిర, చరాస్తులను అటాచ్ చేసింది. ఇందులో జుహూలోని ఓ నివాస ప్లాట్ శిల్పాశెట్టి పేరు మీద ఉన్నట్లు తెలిపింది. దీంతోపాటు పూణెలోని ఓ నివాస బంగ్లా, రాజ్‌కుంద్రా పేరు మీద ఉన్న ఈక్విటీ షేర్లను అటాచ్ చేసినట్లు వెల్లడించింది.