చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా ఎంపిక కోసం ఈనెల 17న సమావేశం నిర్వహించనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ సభ్యులుగా ఉన్న ఈ కమిటీ రాజీవ్ కుమార్ వారసుడిగా తదుపరి సీఈసీని నియమిస్తూ నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుత సీఈసీ రాజీవ్ కుమార్ పదవీకాలం ఈనెల 18వ తేదీతో ముగియనుంది. వెంటనే ఆయన స్థానంలో కొత్త సీఈసీ బాధ్యతలు స్వీకరించాల్సి ఉంటుంది. కేంద్ర ఎన్నికల సంఘంలో సీఈసీతో పాటు ఇద్దరు ఎలక్షన్ కమిషనర్‌లు ఉంటారు. సీఈసీ తర్వాత సీనియన్ అయిన ఎలక్షన్ కమిషనర్ తదుపరి సీఈసీగా నియమితులవడం ఆనవాయితీగా వస్తోంది. రాజీవ్ కుమార్ తర్వాత జ్ఞానేశ్ కుమార్ సీనియర్‌గా ఉన్నారు. ఆయన పదవీకాలం 2029 జనవరి 26 వరకు ఉంది. ఆయన తర్వాత మరో ఎలక్షన్ కమిషనర్‌గా సుఖ్బీర్ సింగ్ సంధూ ఉన్నారు.
రాజీవ్ కుమార్ రిటైర్మెంట్‌తో జ్ఞానేశ్ సీఈసీ అవుతారు. ఆయన ఖాళీ చేసే స్థానంలో మరొకరిని ఎలక్షన్ కమిషనర్‌గా నియమించాల్సి ఉంటుంది. సార్వత్రిక ఎన్నికలకు కొన్ని రోజుల ముందు అరుణ్ గోయల్ పదవి నుంచి తప్పుకున్నారు. అనుప్ చంద్ర పాండే అంతకుముందే రిటైర్ అయ్యారు. దీంతో వారి స్థానంలో జ్ఞానేశ్ కుమార్, సంధూలకు స్థానం కల్పించారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియాను ప్రధాన మంత్రి, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్షనేత, ప్రధాన మంత్రి నామినేట్ చేసిన కేంద్ర కేబినెట్ మినిస్టర్‌తో కూడిన సెలక్షన్ కమిటీ ఎంపిక చేసి రాష్ట్రపతికి నివేదిస్తుంది. ఈ కమిటీ సిఫార్సుల ఆధారంగా రాష్ట్రపతి కొత్త సీఈసీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తారు. ఇప్పుడు నియామకం కాబోయే జ్ఞానేశ్వర్ పదవీకాలం రాబోయే సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు కొన్ని రోజుల ముందే ముగియనుంది. 2029 ఫిబ్రవరి మొదటివారంలో షెడ్యూల్ వచ్చే అవకాశముండగా, అదే ఏడాది జనవరి 26న జ్ఞానేశ్ రిటైర్ కాబోతున్నారు.