సంవిధాన్ హత్యా దివస్.. మోదీపై మండిపడ్డ ప్రియాంక గాంధీ
ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేతలు కేంద్రం చర్యల్ని ఖండించగా.. తాజాగా ప్రియాంక గాంధీ ప్రధాని మోదీపై విమర్శలు ఎక్కుపెట్టారు.
ఇకపై ప్రతి ఏడాదీ జూన్ 25న 'సంవిధాన్ హత్యా దివస్' జరుపుకుందామంటూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. రెండు రోజులుగా ఈ వ్యవహారంపై తీవ్ర దుమారం రేగింది. 1975 జూన్ 25న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ 'రాజ్యాంగ హత్యాదినం' జరుపుకోవాలని కేంద్రం నిర్ణయం తీసుకోవడాన్ని పలువురు ప్రజాస్వామ్య వాదులు తప్పుబడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేతలు కేంద్రం చర్యల్ని ఖండించగా.. తాజాగా ప్రియాంక గాంధీ ప్రధాని మోదీపై విమర్శలు ఎక్కుపెట్టారు.
రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చి ప్రతికూల రాజకీయాలకు పాల్పడేవారు ఇలా చేయడంలో వింతేమీ లేదని అన్నారు ప్రియాంక గాంధీ. దేశం కోసం గొప్ప వ్యక్తులంతా కలసి కట్టుగా ఉద్యమం చేసి స్వాతంత్రం సాధించారని, వారే రాజ్యాంగాన్ని రూపొందించుకున్నారని గుర్తు చేశారు ప్రియాంక. మోదీ ప్రభుత్వం ఆ రాజ్యాంగాన్ని మార్చాలని ఎప్పట్నుంచో ప్రయత్నిస్తోందని, వీలైతే రాజ్యాంగాన్ని రద్దు చేయడానికి కూడా వారు వెనకాడరని అన్నారు. రాజ్యాంగంపై విశ్వాసం ఉండేవారే దాని పరిరక్షణకోసం పాటుపడతారని, ప్రతికూల రాజకీయాలకు పాల్పడేవారే రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటారని, అలాంటి మనస్తత్వం ఉంది కాబట్టే.. వారు 'సంవిధాన్ హత్యా దివస్' పేరుతో రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు ప్రియాంక.
మూడుసార్లు ప్రధాని అయ్యాను, ఈసారి జెట్ స్పీడ్ లో దూసుకెళ్తానంటూ ప్రధాని మోదీ ప్రకటించిన రోజుల వ్యవధిలోనే 'సంవిధాన్ హత్యా దివస్' గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఆయన చెప్పిన స్పీడ్ ఇదేనా అని నెటిజన్లు మండిపడుతున్నారు. మూడు సార్లు అధికారంలోకి వచ్చినా, ఇప్పటికీ కాంగ్రెస్ పై నిందలు వేస్తూ కాలం గడిపేయాలని కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తోందని అంటున్నారు. కేవలం కాంగ్రెస్ ని టార్గెట్ చేసేందుకే 'సంవిధాన్ హత్యా దివస్' ని తెరపైకి తెస్తున్నారని విమర్శిస్తున్నారు. ఎమర్జెన్సీ తప్పా, ఒప్పా అనే చర్చ ఇప్పుడు అనవసరం అని, ఆ పేరుతో ఇప్పటికీ రాజకీయాలు చేయాలనుకోవడమే దౌర్భాగ్యం అని బీజేపీకి కౌంటర్లిస్తున్నారు.