ఢిల్లీ ప్రజలకు సెల్యూట్
ప్రజాశక్తే అత్యున్నతమని నిరూపించారు : ప్రధాని నరేంద్రమోదీ
![ఢిల్లీ ప్రజలకు సెల్యూట్ ఢిల్లీ ప్రజలకు సెల్యూట్](https://www.teluguglobal.com/h-upload/2025/02/08/1401596-narebdra-modi.webp)
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టిన ప్రజలకు ప్రధాని నరేంద్రమోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఢిల్లీ ప్రజలకు సెల్యూట్ అని 'ఎక్స్'లో పోస్ట్ చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజాశక్తే అత్యున్నమని నిరూపించారని పేర్కొన్నారు. ఢిల్లీ ప్రజలు అభివృద్ధి, సుపరిపాలనను కోరుకున్నారని తెలిపారు. ఢిల్లీ ప్రజల జీవనాన్ని మెరుగు పరిచేందుకు, ఢిల్లీ అభివృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని.. ఇది తమ గ్యారంటీ అని పేర్కొన్నారు. ఢిల్లీని కాలుష్య రహితంగా, సుందర నగరంగా తీర్చిదిద్దుతామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ట్వీట్ చేశారు. బీజేపీని గెలిపించిన ఢిల్లీ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఢిల్లీ ప్రజలు అభివృద్ధి, సుపరిపాలనను కోరుకున్నారని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. అవినీతి, కుంభకోణాల పార్టీలను ప్రజలు తిప్పికొట్టారని, డబుల్ ఇంజన్ ప్రభుత్వాన్ని కోరుకున్నారని తెలిపారు. ఆప్ ప్రభుత్వ పదేళ్ల విధ్వంసానికి ప్రజలు తమ ఓటుతో సమాధానమిచ్చారని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్‌సింగ్ ధామీ తెలిపారు. ఇది మోదీ గ్యారంటీ విజయమని.. ఢిల్లీ ప్రజలు డబుల్ ఇంజన్ సర్కారును ఎన్నుకున్నారని, ప్రధాని మోదీ చెప్పింది చేస్తారని ధామీ పేర్కొన్నారు. మోదీ గ్యారంటీని ప్రజలు విశ్వసించారని ఎంపీ బాన్సూరి స్వరాజ్ అన్నారు. చారిత్రాత్మక విజయం కట్టబెట్టిన ఢిల్లీ ప్రజలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఇక కేజ్రీవాల్ ఎప్పటికీ అధికారంలోకి రారని బీజేపీ ఎంపీ మనోజ్ తివారి అన్నారు. పార్టీని విజయపథంలో నడిపించి ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ విషయంలో తాను గర్వంగా ఉన్నానని పేర్కొన్నారు. సమస్యలను కేజ్రీవాల్ దూరంగా పారిపోయారని.. అందుకే ఇప్పుడు అధికారానికి దూరమయ్యారని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ అన్నారు. జల్‌బోర్డులో అవినీతి, శీష్ మహల్, లిక్కర్ స్కాం, నీటి కాలుష్యంపై ఆప్ ఎప్పుడూ సమాధానం ఇవ్వలేదని గుర్తు చేశారు.