Telugu Global
National

రూ. 10 వేల కోట్లు ఇచ్చినా 'ఎన్‌ఈపీ'ని అంగీకరించను

తమిళనాడు రెండు వేల ఏళ్లు వెనక్కి నెట్టే పనిని చేయనన్న సీఎం స్టాలిన్‌

రూ. 10 వేల కోట్లు ఇచ్చినా ఎన్‌ఈపీని అంగీకరించను
X

జాతీయ విద్యా విధానాన్ని తమిళనాడులో అమలుచేసే ప్రసక్తే లేదని సీఎం ఎంకే స్టాలిన్‌ మరోసారి స్పష్టం చేశారు. దీనికోసం రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం రూ. 10 వేల కోట్లు మంజూరు చేసినా అంగీకరించేది లేదన్నారు. హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నమే కాకుండా.. విద్యార్థుల భవిష్యత్తు, సామాజిక న్యాయవ్యవస్థపై ప్రభావం చూపే అనేక అంశాలు ఉండటం వల్లనే 'ఎన్‌ఈపీ'ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. భారతీయ భాషల మధ్య మంటలు పెట్టొద్దంటూ ప్రధాని మోడీ హితబోధ చేసిన వేళ.. కడలూరులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో స్టాలిన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

మేం ఏ భాషనూ వ్యతిరేకించడం లేదు. కేవలం హిందీ కోణంలోనే కాకుండా.. ఎన్‌ఈపీపై వ్యతిరేకతకు ఇతరత్రా అనేక కారణాలూ ఉన్నాయి. నీట్‌ మాదిరిగానే ఆర్ట్స్‌, సైన్స్‌ కళాశాలల్లో ప్రవేశాలకూ పరీక్షలు రాయాల్సి వస్తుంది. విద్యార్థులను చదువుల నుంచి దూరం చేస్తుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఇప్పుడు అందుతున్న ఆర్థిక సాయాన్ని అడ్డుకుంటుంది. ఎన్‌ఈపీని అమలు చేస్తే రాష్ట్రానికి రూ. 2 వేల కోట్లు వస్తాయని కేంద్రం చెబుతున్నది. రూ. 10 వేల కోట్లు ఇచ్చినా.. దీనికి అంగీకరించను. తమిళనాడు రెండు వేల ఏళ్లు వెనక్కి నెట్టే పనిని చేయను అని సీఎం స్టాలిన్‌ వ్యాఖ్యానించారు.

First Published:  22 Feb 2025 8:44 PM IST
Next Story