సంభల్ వెళ్లకుండా రాహుల్, ప్రియాంకల అడ్డగింత
స్థానికేతరులు అక్కడికి రావడంపై ఆంక్షలున్న నేపథ్యంలో ఘాజీపూర్ సరిహద్దు వద్ద కాంగ్రెస్ ఎంపీల వాహనాలను అడ్డుకున్న పోలీసులు
యూపీలోని సంభల్‌లో ఇటీవల హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకుని ఐదుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ గటనలో బాధితులను పరామర్శించడానికి బయలుదేరిన కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాను పోలీసులు అడ్డుకున్నారు. స్థానికేతరులు అక్కడికి రావడంపై ఆంక్షలున్న నేపథ్యంలో ఘాజీపూర్ సరిహద్దు వద్ద కాంగ్రెస్ ఎంపీల వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు.సంభల్‌కు పోలీసులు అనుమతించకపోవడంతో రాహుల్, ప్రియాంకలు ఢిల్లీకి తిరిగి పయనమయ్యారు.
రాహుల్, ప్రియాంక సంభల్ పర్యటనకు సిద్ధమైన నేపథ్యంలో బుధవారం ఉదయం నుంచే ఢిల్లీ సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఘాజీపూర్ సరిహద్దు వద్ద భారీగా పోలీసులు మోహరించారు. బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేతలు అక్కడికి చేరుకోగానే పోలీసులు వారిని నిలువరించారు. దీంతో ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. మరోవైపు ఈ పరిణామాలతో ఘాజీపూర్ సరిహద్దు వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
యూపీలోని సంభల్ జిల్లాలో ఓ మసీదు ఉన్న స్థానంలో దేవాలయం ఉన్నదని కొందరు హిందూ పిటిషనర్లు గతంలో ట్రయల్ కోర్టును ఆశ్రయించారు. దానిపై విచారణ జరిపిన న్యాయస్థానం సర్వేకు ఆదేశాలు ఇచ్చింది. ఆ సర్వే జరుగుతున్న సమయంలోనే అల్లర్లు చెలరేగాయి. స్థానికులు, పోలీసులపై కొందరు రాళ్లతో దాడి చేశారు. పోలీసులు, అధికారుల వాహనాలకు నిప్పుపెట్టారు. ఆ ఘర్‌షణలో ఐదుగురు మృతి చెందగా..పలువురు గాయపడ్డారు.ప్రస్తుతం ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. మరోవైపు ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా సంభల్‌కు స్థానికేతరులెవరూ రావొద్దని జిల్లా కలెక్టర్ ఆంక్షలు విధించారు. ఇటీవల అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ బృందం అక్కడికి వెళ్లడానికి యత్నించగా పోలీసులు అడ్డుకొని వెనక్కి పంపించారు.