Telugu Global
National

పార్లమెంట్ లో పద్మవ్యూహం.. రాహుల్ గాంధీ ఏమన్నారంటే..?

ఈనాటి పద్మవ్యూహంలో నరేంద్ర మోదీ, అమిత్ షా, మోహన్ భగవత్, అజిత్ ధోవల్, అదానీ, అంబానీ.. అభిమన్యుడిని చుట్టుముట్టారన్నారు రాహుల్ గాంధీ.

పార్లమెంట్ లో పద్మవ్యూహం.. రాహుల్ గాంధీ ఏమన్నారంటే..?
X

పార్లమెంట్ లో కురుక్షేత్ర యుద్ధ గాధను ప్రస్తావిస్తూ బీజేపీపై సెటైర్లు పేల్చారు విపక్ష నేత రాహుల్ గాంధీ. కురుక్షేత్రంలో అభిమన్యుడిని చక్రవ్యూహంలో బంధించి హతమార్చారని అన్నారు. చక్ర వ్యూహానికి మరో పేరు పద్మవ్యూహం అంటూ.. బీజేపీ ఎన్నికల గుర్తు కమలం పువ్వుని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా భారత్ లో పద్మవ్యూహం అమలులో ఉందన్నారు రాహుల్ గాంధీ.


చక్రవ్యూహం లోపల భయం, హింస ఉంటుందని అన్నారు రాహుల్ గాంధీ. ఆనాటి చక్ర వ్యూహంలో అభిమన్యుడిని ఆరుగురు చుట్టుముట్టి మట్టుబెట్టారన్నారు. ద్రోణాచార్యుడు, కర్ణుడు, కృపాచార్యుడు.. ఇలా ఆరుగురు అభిమన్యుడిని అంతం చేశారన్నారు. 21వ శతాబ్దంలో కూడా చక్రవ్యూహం ఉందని ఇక్కడ కూడా ఆరుగురు ప్రధాన పాత్రధారులు ఉన్నారని చెప్పారు.

ఈనాటి పద్మవ్యూహంలో నరేంద్ర మోదీ, అమిత్ షా, మోహన్ భగవత్, అజిత్ ధోవల్, అదానీ, అంబానీ.. అభిమన్యుడిని చుట్టుముట్టారన్నారు రాహుల్ గాంధీ. అక్కడ అభిమన్యుడు లాగా ఇక్కడ యువత, రైతులు, చిరు వ్యాపారులు, మహిళలు పద్మవ్యూహంలో చిక్కుకున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం చక్రవ్యూహాన్ని నిర్మిస్తే.. కుల గణన చేపట్టి దాన్ని విచ్ఛిన్నం చేస్తామన్నారాయన. తాజా బడ్జెట్ పై కూడా తీవ్ర విమర్శలు చేశారు రాహుల్ గాంధీ. ఇద్దరు బడా పారిశ్రామిక వేత్తలు దేశంలోని మౌలిక సదుపాయాలను నియంత్రిస్తున్నారని అన్నారు.

First Published:  29 July 2024 9:38 PM IST
Next Story