Telugu Global
National

ప్రొఫెసర్‌ సాయిబాబా భౌతికకాయాన్ని ఆస్పత్రికి అప్పగిస్తాం

ఆయన కోరిక మేరకు భౌతికకాయాన్ని ఆస్పత్రికి అప్పగించనున్నట్లు కుటుంబసభ్యుల ప్రకటన

ప్రొఫెసర్‌ సాయిబాబా భౌతికకాయాన్ని ఆస్పత్రికి అప్పగిస్తాం
X

ఢిల్లీ వర్సిటీ మాజీ ప్రొఫెసర్‌, పౌరహక్కుల ఉద్యమకారుడు జీఎన్‌ సాయిబాబా శనివారం రాత్రి హైదరాబాద్‌ నిమ్స్‌లో కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయితే.. ఆయన కోరిక మేరకు భౌతికకాయాన్ని ఆస్పత్రికి అప్పగించనున్నట్లు కుటుంబసభ్యులు ప్రకటించారు. ఇప్పటికే సాయిబాబా నేత్రాలను ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆస్పత్రికి దానం చేసినట్లు తెలిపారు. సాయిబాబా భౌతిక కాయాన్ని హైదరాబాద్‌లోని జవహర్‌నగర్‌కు తరలించారు. బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు నివాళులు అర్పించిన తర్వాత ఆయన కోరిక మేరకు భౌతికకాయాన్ని ఆస్పత్రికి అందజేస్తామని కుటుంబసభ్యులు ఓ ప్రకటనలో తెలిపారు.

సాయిబాబా మానవహక్కుల ఉద్యమకారుడు, రచయిత, విద్యావేత్తగా గుర్తింపు పొందారు. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో 2014లో సాయిబాబాను పోలీసులు అరెస్టు చేశారు. 2017లో ఆయనకు గడ్చిరోలి సెషన్స్‌ కోర్టు జీవిత ఖైదు విధించింది. దీంతో సుమారు పదేళ్ల పాటు ఆయన జైల్లోనే గడిపారు. ఈ ఏడాది మార్చి 5న బాంబే హైకోర్టు ఆయనను నిర్దోషిగా ప్రకటించడంతో నాగ్‌పూర్‌ జైలు నుంచి విడుదలయ్యారు.

సవాళ్లు ఎదురైనా ధైర్యసాహసాలు చూపారు :ఎంకే స్టాలిన్‌

ప్రొఫెసర్‌ జీఎన్‌ సాయిబాబ మృతిపట్ల తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ సంతాపం తెలిపారు. ఆయన మరణం పౌర హక్కుల ఉద్యమానికి తీరని లోటు అన్నారు. అణగారిని వర్గాలపై జరిగిన అన్యాయాలకు వ్యతిరేకంగా గళం వినిపించారు. తన స్వేచ్ఛకు, ఆరోగ్యానికి ముప్పు వాటిల్లినా అవిశ్రాంతంగా పోరాడారని కొనియాడారు. పౌర హక్కులను కాపాడే క్రమంలో సవాళ్లు ఎదురైనా సాయిబాబా చూపిన ధైర్యసాహసాలు చిరస్థాయిగా నిలుస్తాయని ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ఈ క్లిష్ట సమయంలో ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

సాయిబాబా మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటు: కేటీఆర్‌

హక్కుల ఉద్యమకారుడు ప్రొఫెసర్‌ సాయిబాబా అకాల మరణం బాధకరమని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. ఆయన కుటుంబసభ్యులు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. దేశంలో ప్రజా ఉద్యమాలకు సాయిబాబా మరణం తీరని లోటు అన్నారు.

కేంద్రం కుట్రపూరితంగా ఆయనపై దేశద్రోహ నేరం మోపింది: తమ్మినేని

సాయిబాబా మృతి పట్ల సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ సంతాపం ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఓ ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా దేశద్రోహ నేరం మోపి 90 శాతం అంగవైకల్యంతో ఉన్న సాయిబాబాను ఉపా చట్టం కింద సుదీర్ఘకాలం జైలులో నిర్బంధించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనను అర్బన్‌ నక్సలైట్‌గా ముద్రవేసిందన్నారు. జైలులో ఉన్న సమయంలో ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా సరైన వైద్యం అందించలేదని ఆవేదన వ్యక్తం చేఏశారు. బీజేపీ ప్రభుత్వ విధానాలకు, అణిచివేతకు వ్యతిరేకంగా పోరాడిన సాయిబాబా దళిత, గిరిజన, వికలాంగుల హక్కుల నేతగా. విద్యావేత్తగా పేరు పొందారు. ఆయన మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటు అన్నారు.

First Published:  13 Oct 2024 6:43 PM IST
Next Story