Telugu Global
National

ప్రొఫెసర్‌ జీఎన్‌ సాయిబాబా కన్నుమూత

అనారోగ్యంతో నిమ్స్ లో తుది శ్వాస విడిచిన ఉద్యమ యోధుడు

ప్రొఫెసర్‌ జీఎన్‌ సాయిబాబా కన్నుమూత
X

ప్రముఖ విద్యావేత్త, ఉద్యమ యోధుడు, ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ జీఎన్‌ సాయిబాబా తీవ్ర అనారోగ్యంతో శనివారం రాత్రి కన్నుమూశారు. మావోయిస్టులతో ఆయనకు సంబంధాలున్నాయని ఆరోపిస్తూ ప్రభుత్వం ఆయనను పదేళ్ల పాటు జైళ్లో పెట్టింది. నాగ్‌ పూర్‌ జైలులోని అండాసెల్‌ లో విచారణ ఖైదీగా ఉన్నప్పుడే ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. 2014 మే 9న ఆయనను అరెస్ట్‌ చేయగా ఈ ఏడాది మార్చి 5న బాంబే హైకోర్టు నాగ్‌ పూర్‌ బెంచ్‌ ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది. ఆయన జైలు నుంచి మార్చి 7వ తేదీన విడుదలయ్యారు. 57 ఏళ్ల సాయిబాబాకు రెండు కాళ్లు చిన్నప్పుడే చచ్చుబడిపోవడంతో చక్రాల కుర్చీకే పరితమయ్యారు. ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతుండగా పది రోజుల క్రితం హైదరాబాద్‌ లోని నిమ్స్‌ ఆస్పత్రిలో చేర్పించారు. గాల్‌ బ్లాడర్‌ లో స్టోన్స్‌ రావడంతో ఆపరేషన్‌ చేసి వాటిని తొలగించారు. ఆపరేషన్‌ తర్వాత అనారోగ్య సమస్యలు పెరిగి ఆయన తుది శ్వాస విడిచారు.

ఢిల్లీ యూనివర్సిటీలోని ఆనంద్‌ కాలేజీలో ఇంగ్లిష్‌ ప్రొఫెసర్‌ గా పని చేస్తున్న జీఎన్‌ సాయిబాబాకు మావోయిస్టులతో సంబంధాలున్నాయని ఆరోపిస్తూ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ లోని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో పేద రైతు కుటుంబంలో జన్మించిన గోకరకొండ నాగసాయిబాబాకు ఐదేళ్ల వయసులోనే పోలియో సోకడంతో రెండు కాళ్లు చచ్చుబడిపోయాయి. అయినా ఆయన చదువును నిర్లక్ష్యం చేయలేదు. కోనసీమ భానోజీ రామర్స్‌ కాలేజీలో డిగ్రీ, హైదరాబాద్‌ సెంట్రల్‌ వర్సిటీలో పీజీ చేసిన ఆయన విద్యార్థి దశలో వామపక్ష రాజకీయల్లో పని చేశారు. ఆల్‌ ఇండియా పీపుల్స్‌ రెసిస్టెన్స్‌ ఫోరమ్‌ లో పని చేశాడు. పలు ఉద్యమ సంస్థలకు సేవలందించారు. పౌర హక్కుల ఉద్యమాల్లోనూ ఆయన క్రియాశీల సేవలందించారు. జైలు నుంచి విడుదలైన తర్వాత ఏడు నెలలకే ఆయనను అనారోగ్యం బలితీసుకోవడంపై పలువురు హక్కుల ఉద్యమ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. సాయిబాబా మరణం ప్రభుత్వ హత్యేనని ఆరోపిస్తున్నారు.

First Published:  12 Oct 2024 4:44 PM GMT
Next Story