ఎంపీగా ప్రియాంక గాంధీ ప్రమాణ స్వీకారం
చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకొని ప్రమాణం చేసిన వయనాడ్ ఎంపీ
వయనాడ్ నుంచి ఎంపీగా గెలిచిన ప్రియాంక గాంధీ గురువారం లోక్‌సభలో ప్రమాణ స్వీకారం చేశారు. లోక్‌సభ ప్రారంభం కాగానే స్పీకర్ ఓం బిర్లా కొత్తగా ఎన్నికైన ఎంపీలతో ప్రమాణం చేయించారు. భారత రాజ్యాంగాన్ని పట్టుకొని ఆమె ప్రమాణ స్వీకారం చేశారు. ఎంపీగా తొలిసారి లోక్‌సభకు వచ్చిన ప్రియాంకకు ఆమె సోదరుడు, కాంగ్రెస్, ఇండియా కూటమిలోని ఎంపీలు సాదరంగా స్వాగతం పలికారు. సంసద్ భవన్ మెట్లపై ప్రియాంకను రాహుల్ గాంధీ ఫొటోలు తీశారు. పలువురు ఎంపీలు ఆమెతో కలిసి ఫొటోలు దిగారు. కేరళ సంప్రదాయ కసావు (గోల్డెన్ బోర్డర్‌లోని వైట్ కలర్) చీరలో ఆమె సభకు వచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ తో పాటు ఉత్తరప్రదేశ్ లోని రాయ్‌బరేలి నుంచి ఎంపీగా గెలిచారు. దీంతో వయనాడ్ సీటుకు రాజీనామా చేయగా, ప్రియాంక గాంధీ మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు. నాలుగు లక్షలకు పైచిలుకు ఓట్ల భారీ మెజార్టీతో ఆమె విజయం సాధించారు.