Telugu Global
National

ఒమర్‌కు సాయం చేయడానికి సిద్ధం

ఎల్పీకే ఎక్కువ అధికారాలున్న స్టేట్‌లో పాలనాపరంగా ఏదైనా సమస్య ఎదురైతే తనను సంప్రదించాలని ఒమర్‌కు కేజ్రీవాల్‌ సూచన

ఒమర్‌కు సాయం చేయడానికి సిద్ధం
X

సీఎం అధికారాలు పరిమితంగా ఉండే ఢిల్లీని తాను పదేళ్లు పాలించానని.. ఈ క్రమంలోనే జమ్మూకశ్మీర్‌ పాలన విషయంలో ఏమైనా సమస్యలు వస్తే తనను సంప్రదించాలని ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ సూచించారు. జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్సీ-కాంగ్రెస్‌ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. ఒమర్‌ అబ్దుల్లా సీఎంగా బాధ్యతలు చేపట్టడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేజ్రీవాల్‌ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

జమ్ముకశ్మీర్‌ సీఎంగా ఒమర్‌ అబ్దుల్లా మరికొద్ది రోజుల్లో బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రభుత్వాన్ని నడపడంలో సంపూర్ణ మద్దతు అందిస్తాం. ఆయన నాయకత్వంలో జమ్మూకశ్మీర్‌ అభివృద్ధిపథంలో దూసుకెళ్తుందని ఆశిస్తున్నాం. ముఖ్యమంత్రికి పరిమిత అధికారాలున్న కారణంగా ఢిల్లీని 'హాఫ్‌ స్టేట్' అని పిలుస్తారు. ఇప్పుడు జమ్మూకశ్మీర్‌ను ఇలాగే మార్చేశారు. ఎన్నికైన ప్రభుత్వాల కంటే లెఫ్టినెంట్‌ గవర్నర్‌కే అధికారాలు ఎక్కువ. ఈ నేపథ్యంలో పాలనాపరంగా ఏదైనా సమస్య ఎదురైతే నన్ను సంప్రదించండి. ఢిల్లీ సీఎం పదేళ్లు ప్రభుత్వాన్ని నడిపాను. అని మాజీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ వ్యాఖ్యానించారు.

అసెంబ్లీ ఎన్నికల్లో దోడా నియోజకవర్గం నుంచి విజయం సాధించిన ఆప్‌ ఎమ్మెల్యే మెహ్రాజ్‌ మాలిక్‌కు ఓటు వేసినందుకు ప్రజలకు కేజ్రీవాల్‌ ధన్యవాదాలు చెప్పారు. ఆదివారం దోడాలో పర్యటించిన ఆయన.. తాము అభివృద్ధి మాత్రమే కాంక్షిస్తున్నామన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీఎంలు లేదా ప్రధాని కావాలనే రేసులో లేమని తెలిపారు. కొత్త తరహా రాజకీయాలకు ఆప్‌ పేరు పొందిందని, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే తమ లక్ష్యమన్నారు.

First Published:  13 Oct 2024 8:24 PM IST
Next Story