Telugu Global
National

కుంభమేళా నిర్వహించడం రాకపోతే సాయం చేయడానికి సిద్ధం

కుంభమేళాకు సమయం సమీపిస్తున్నా భక్తుల భద్రతకు సరైన సౌకర్యాలు కల్పించడంలో అలసత్వం వహిస్తున్నారని అఖిలేశ్‌ ఫైర్‌

కుంభమేళా నిర్వహించడం రాకపోతే సాయం చేయడానికి సిద్ధం
X

సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ బీజేపీపై విమర్శలు గుప్పించారు. బీజేపీ నేతలు డబ్బు సంపాదించడంలో, ఎన్నికల ప్రణాళికల్లో బిజీగా ఉండి.. మహా కుంభమేళా జరుగుతున్న ఏర్పాట్లలో పాల్గొనలేకపోతున్నారని అఖిలేశ్‌ విమర్శించారు. కుంభమేళాకు సమయం సమీపిస్తున్నా భక్తుల భద్రతకు సరైన సౌకర్యాలు కల్పించడంలో అలసత్వం వహిస్తున్నారని పేర్కొన్నారు. వారికి కుంభమేళాను నిర్వహించడం రాకపోతే యూపీ ప్రభుత్వానికి సహాయం చేయడానికి తమ పార్టీ సిద్ధంగా ఉందని అన్నారు.

మహా కుంభమేళాకు చేయాల్సిన ఏర్పాట్లలో అధికారుల సమన్వయలోపం వల్ల భద్రతాపరమైన ఏర్పాట్లు ఆలస్యమవుతున్నాయని ఆయన ఆరోపించారు. స్థానిక ప్రజలకు రవాణా సౌకర్యాలు, ఇతర అసవరాల కల్పనను యోగి ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు. వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదన్నారు. అధికారులు వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని కోరారు. ఏర్పాట్లలో ఆలస్యం జరగకుండా ఉండటానికి తమ నేతలు ప్రభుత్వానికి సహకరిస్తారన్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని తాము కోరుకుంటున్నామన్నారు. 'మహదాని' పరిపాలకుడు హర్షవర్ధనుడి విగ్రహం తొలిగించడంలో ఆత్రుత ప్రదర్శించిన బీజేపీ ప్రభుత్వం.. ఇప్పుడు మాత్రం అదే వేగాన్ని ఎందుకు చూపెట్టడం లేదని విమర్శించారు.

ప్రయాగ్‌రాజ్‌లో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ఈ మహా కుంభమేళా కొనసాగనున్నది. ప్రతి 12 సంవత్సరాలకు నిర్వహించే ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి దేశవ్యాప్తంగా కోట్లాదిమంది యాత్రికులు ప్రయాగ్‌రాజ్‌కు చేరుకుంటారు. సుమారు 45 కోట్ల మంది యాత్రికులు, సాధువులు, సన్యాసులు, పర్యాటకులు రానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

First Published:  25 Dec 2024 2:38 PM IST
Next Story